భారత్ ఆతిథ్యమిస్తున్న జీ-20 సమావేశాల్లో భాగంగా దిల్లీకి వచ్చిన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషీ,ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి పెన్నీ వోంగ్ హాజరై.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా క్వాడ్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రులు ప్రకటించారు.
కొత్త అభివృద్ధి చెందుతున్న ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన చర్యలను అన్వేషించేందుకు ఈ క్వాడ్ వర్కింగ్ గ్రూప్ పనిచేయనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో క్వాడ్ ఎజెండాను సమన్వయం చేసి పూర్తిచేయడానికి మంత్రులు ప్రతిజ్ఞ చేశారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుపై.. అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతున్న వేళ ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, శాంతి కొనసాగించాలని.. చట్టాలు, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత కాపాడాలని.. భేటీ తర్వాత 4 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. వివాదాలకు శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నాయి.