Qatar Indian Navy Case :గూఢచర్యం ఆరోపణలతో ఖతార్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికదళ అధికారులకు భారీ ఊరట లభించింది. వారికి విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ ఖతార్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వారి శిక్షను తగ్గిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. పూర్తి తీర్పు కోసం అక్కడి అధికారులతో మాట్లాడుతున్నామని వివరించింది. ఖతార్‌లోని తమ రాయబారి, మాజీ అధికారుల కుటుంబాలు ప్రస్తుతం కోర్టులోనే ఉన్నాయని చెప్పింది. ఈ అంశంపై మొదటి నుంచి పోరాడుతున్నామని, ఇకపై కూడా తాము న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపింది. తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని వెల్లడించింది. కేసుకు ఉన్న గోప్యత, సున్నితత్వం దృష్ట్యా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని చెప్పింది. వీరి మరణశిక్షను సవాల్ చేస్తూ భారత విదేశాంగ శాఖ కోర్టులో అప్పీల్ చేసింది.
అసలేం జరిగిందంటే..?
Indian Navy Officers Detained In Qatar :భారత్‌కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్‌లోని అల్ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు. అయితే, భారత్‌కు చెందిన ఈ 8 మందిని ఖతార్ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించారు. అయితే, వీరందరికి భారత అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది ఖతార్ ప్రభుత్వం. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు బాధితులతో పాటు ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, వారిని రక్షించేందుకు ప్రయత్నించింది. అనంతరం ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం, ఆ 8 మందికి మరణ శిక్ష విధిస్తూ ఈ ఏడాది అక్టోబరులో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుని వారి మరణశిక్షను రద్దుచేసి జైలుశిక్ష విధించింది న్యాయస్థానం.