Iran Drones To Russia: శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి మనకు బాగా తెలుసు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మానవ రహిత డ్రోన్ల కోసం రష్యా.. ఇరాన్ వైపు చూస్తోందని అమెరికా వెల్లడించింది. ఈ తరహా డ్రోన్లు ఆయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అటు రష్యా, ఇటు ఇరాన్ రెండూ అమెరికాతో వైరాన్ని కలిగి ఉన్నాయి. అయితే.. ఇరాన్ ఇప్పటికే డ్రోన్లను రష్యాకు అందజేసిందా అనే విషయంపై స్పష్టత లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ వెల్లడించారు. ఈ డ్రోన్లను ఎలా ఉపయోగించాలో రష్యా బలగాలకు ఇరాన్ ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. వందలాది డ్రోన్లను ఇరాన్ రష్యాకు అందజేసే సంకేతాలు ఉన్నట్లు వివరించారు.
ఇరాన్‌కు పుతిన్:ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్‌కు వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే వారం ఇరాన్‌కు వెళ్లి అక్కడే ఇరాన్, టర్కీ దేశాల నేతలతో పుతిన్ త్రైపాక్షిక సమావేశానికి హాజరుకానున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అయితే.. ఇది ఈ చర్చలు సిరియా అంశంపై అని ఆయన పేర్కొన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌తో కూడా పుతిన్ విడిగా సమావేశం కానున్నారని స్పష్టం చేశారు.
దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రతినిధి కూడా స్పందించారు. కానీ.. అమెరికా చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం ఖండించలేదు. ఇరాన్-రష్యా సంబంధాలు.. ఉక్రెయిన్‌తో యుద్ధం కంటే ముందు నుంచే బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అధునాతన డ్రోన్ల సరఫరా కూడా ఇందులో భాగమేనని అన్నారు.
మరోవైపు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ పర్యటనలు చేపట్టనున్న తరుణంలో.. పుతిన్ ఇరాన్ పర్యటన చర్చనీయాంశంగా మారింది.