Putin On Wagner Group Rebellion : వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు సమయంలో ఐక్యత ప్రదర్శించినందుకు గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తిరుగుబాటు ముగిసిన తర్వాత తొలిసారి ప్రసంగించిన పుతిన్.. దేశాన్ని రక్షించేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అటు పరిస్థితిని రక్తపాతం కాకుండా చూసిన చాలా మంది వాగ్నర్ కిరాయి ముఠా సభ్యులకు కూడా పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు.
దీంతోపాటు రష్యాను బ్లాక్మెయిల్ చేయాలని, అలజడి సృష్టించాలని ప్రయత్నించినా అవేవీ ఫలించవని హెచ్చరించారు. ఇచ్చిన హామీ ప్రకారం వాగ్నర్ గ్రూపుసైనికులు బెలారస్ వెళ్లడానికి అనుమతి ఇస్తున్నానని.. వారు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని చెప్పారు. ఒకవేళ రష్యాకు సేవ చేయాలనుకుంటే.. రక్షణ శాఖ, మిగతా భద్రత ఏజెన్సీలతో కాంట్రాక్ట్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రిగోజిన్, మాస్కో మధ్య మధ్యవర్తిగా ఉన్నందుకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోకు కృతజ్ఞతలు తెలిపారు.
మా ఉద్దేశం అది కాదు : ప్రిగోజిన్
Prigozhin On Putin : మరోవైపు.. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్11 నిమిషాలున్న ఓ ఆడియో ప్రకటన విడుదల చేశారు. రష్యాపై తాము చేసిన తిరుగుబాటు పుతిన్ సర్కారును పడదోయడానికి కాదని.. ఉక్రెయిన్‌పై దండయాత్ర ఎలా కొనసాగించాలో చెప్పి నిరసన వ్యక్తం చేయడమే ఉద్దేశమని పేర్కొన్నారు. వాగ్నర్‌కు చెందిన 30 మందిని రష్యా సైన్యం హతమార్చడం వల్లే న్యాయం కోసం తాము కదం తొక్కాల్సి వచ్చిందని వివరించారు.