తెలంగాణ

telangana

ETV Bharat / international

10 మంది పిల్లల్ని కంటే నజరానా, మహిళలకు పుతిన్ బంపర్ ఆఫర్ - సోవియట్‌ ప్రీమియర్‌ జోసెఫ్‌ స్టాలిన్

రష్యాలో కొంతకాలంగా జనాభా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుటుంబాలను విస్తరించే దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు. 10, అంతకంటే కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు నజరానా ప్రకటించారని వాషింగ్టన్ పోస్ట్​ కథనం వెల్లడించింది.

Putin
పుతిన్

By

Published : Aug 18, 2022, 5:36 PM IST

Putin offers baby formula: గత కొంతకాలంగా రష్యాలో జనాభా తగ్గుతోంది. దీంతో ఆందోళన చెందిన అధ్యక్షుడు పుతిన్‌ దేశంలో జనాభాను పెంచుకోవడం కోసం సోవియట్‌ కాలంలో అమల్లో ఉన్న ఓ పురస్కారాన్ని మళ్లీ పునరుద్ధరించారు. కుటుంబాలను విస్తరించే దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు గానూ.. 10, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు నజరానా ప్రకటించారు. ఈ మేరకు 'మదర్‌ హీరోయిన్‌' అవార్డును గత సోమవారం ప్రకటించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది.

పది మంది అంతకంటే ఎక్కువ పిల్లలను కనే మహిళలకు మిలియన్‌ రూబెల్స్‌ (భారత కరెన్సీలో దాదాపు రూ.13లక్షలకుపైన) నజరానా ఇస్తామని పుతిన్‌ సర్కారు ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే, దీనికో మెలిక కూడా పెట్టింది. 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజు నాడు ఈ నగదు చెల్లిస్తారట. అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టారు. ఈ అవార్డుకు సంబంధించి రష్యా మీడియాలో పలు కథనాలు వెలువడినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ అవార్డును 1944లో అప్పటి సోవియట్‌ ప్రీమియర్‌ జోసెఫ్‌ స్టాలిన్ ప్రవేశపెట్టారు. యూఎస్‌ఎస్‌ఆర్‌ గౌరవ పురస్కారంగా పేర్కొంటూ దాదాపు 4లక్షల మంది పౌరులకు ఈ అవార్డును అందజేశారు. ఇప్పుడు రష్యా జనాభా పెంచడం కోసం పుతిన్‌ ఈ అవార్డును మళ్లీ వెలుగులోకి తీసుకురావడం గమనార్హం. కుటుంబం ఎంత పెద్దగా ఉంటే దేశంపై అంత ఎక్కువ గౌరవం ఉంటుందని పుతిన్‌ అభిప్రాయపడుతున్నారట.

గత కొంతకాలంగా రష్యాలో జనాభా తగ్గుతున్నట్లు అనేక నివేదికలు వెల్లడించాయి. కొవిడ్‌ మహమ్మారితో పాటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కూడా ఇందుకు కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన నాటి నుంచి వేలాది మంది క్రెమ్లిన్‌ సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 15వేల మంది రష్యా సైనికులు మృతిచెంది ఉంటారని అంచనా. అయితే క్రెమ్లిన్‌ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతోంది.
ఏదేమైనప్పటికీ.. ప్రస్తత పరిస్థితుల్లో కేవలం మిలియన్‌ రూబెల్స్‌ కోసం 10 మంది పిల్లల్ని కని పెంచడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ అవార్డుకు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి..!

ఇవీ చదవండి:మంకీపాక్స్ విజృంభణ,​ వ్యాక్సిన్​పై డబ్ల్యూహెచ్​ఓ కీలక వ్యాఖ్యలు

ఆకలితో అల్లాడుతున్న ప్రపంచం, ఐరాస నివేదిక

ABOUT THE AUTHOR

...view details