Putin Kim Jong Un Meeting : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో త్వరలో సమావేశం అయ్యే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నందున రష్యా ఆయుధాలను సమీకరించాలనుకుంటుదని.. ఈ నేపథ్యంలోనే కిమ్ ఆ దేశంలో పర్యటించే అవకాశాలున్నాయని వెల్లడించారు.
గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ సోమవారం తెలిపారు. క్లెమ్లిన్కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని చెప్పారు. 'ఈ చర్చలను కొనసాగించాలని, రష్యాలో అధినేతల స్థాయి దౌత్య చర్చలు జరగాలని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. అయితే, ఆయుధ కొనుగోళ్లపై రష్యాతో చర్చలు నిలిపివేయాలని, ఆయుధాలని విక్రయించకూడదని ఉత్తర కొరియా చేసిన ప్రకటనపై ఆ దేశం కట్టుబడి ఉండాలని అమెరికా కోరుతోంది' అని వాట్సన్ వివరించారు. అయితే, ఇరు దేశాలు (రష్యా-ఉత్తరకొరియా) సంయుక్త యుద్ధ విన్యాసాలను చేపట్టే అవకాశం ఉందని షోయిగు సోమవారం తెలిపారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు పర్యటించిన తరుణంలోనే పుతిన్-కిమ్ భేటీ ఉంటుందని అమెరికా అంచనా వేసింది.
ఆ ఆంక్షలు తొలగిస్తేనే!.. తేల్చి చెప్పిన రష్యా!
తమ దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు తొలగిస్తేనే.. తిరిగి ధాన్య ఒప్పందంలోకి చేరతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు. ఈ మేరకు పుతిన్ సోమవారం తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌తో చర్చించారు. యుద్ధం కొనసాగుతున్న కారణంగా నల్లసముద్రం మీదుగా ఉక్రెయిన్-రష్యా వ్యవసాయ ఉత్పత్తుల సురక్షిత రవాణాకు సంబంధించి గతంలో ఐక్యరాజ్యసమితి, తుర్కియే మధ్యవర్తిత్వంతో ధాన్య ఒప్పందం కుదిరింది.