అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లండన్ పట్టణంలో ఓ గ్రామాన్నే తమ నివాసం చేసుకుందీ కుటుంబం. సుస్థిరమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో.. బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రత్యేకంగా నివాసాలు ఏర్పాటు చేసుకుంది. కుటుంబంలో ఉండేది నలుగురే అయినా.. ఎవరి ఇల్లు వారిదే. తల్లిదండ్రులకు ఒకటి, పిల్లలకు ఒక్కోటి, అందరు కలిసి ఉండేందుకు మరోటి.. ఇలా చిన్న చిన్న ఇళ్లతో ఏకంగా గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది. సుస్థిరమైన జీవన విధానాన్ని అందరికీ తెలియజేయడానికి వారు ప్రత్యేకంగా ఇలా జీవిస్తున్నారు.
2015లోనే భూమి కొని..
కెలి, రియాన్ బ్రింకెన్ కుటుంబం తమ ఇద్దరు టీనేజ్ పిల్లలతో కలిసి ఈ గ్రామంలో నివసిస్తున్నారు. కెంటకీలోని లండన్‌లో 2015లోనే బ్రింకెన్ కుటుంబం 21ఎకరాల భూమిని.. 57వేల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ భూమిలో 6 చిన్న ఇళ్లను ఏర్పాటు చేసుకుంది.
"భూమిని కొనడానికి కెంటకీలోని లండన్‌ను ఎంపిక చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ భూమి విలువ చాలా తక్కువ. ఇళ్లు నిర్మించుకునే విషయంలో ఆంక్షలు కూడా తక్కువగా ఉంటాయి. టెన్నెసీ ప్రాంతంలో కంటే చాలా తక్కువ ధరలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాం" అని కేలి చెప్పారు.
కేలి, రియాన్ నివసిస్తున్న 280 చదరపు అడుగుల ఇల్లు విలువ 9వేల డాలర్లు. అన్ని రకాల సౌకర్యాలతో ఈ ఇంటిని నిర్మించారు. "వెంటిలేషన్ కోసం ఎక్కువ కిటికీలు, ఎగ్జిట్ డోర్ కోసం వెనుక భాగంలో అదనపు కటౌట్ ప్రాంతం, ఇంట్లోకి వెలుగు ఎక్కువ రావడం కోసం కొన్ని మార్పులు చేయించాం" అని కేలి చెప్పారు. వీరి కూతురు లెనాక్స్, కుమారుడు బ్రాడీ 160 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న చిన్న ఇళ్లలో నివసిస్తున్నారు. కుటుంబం అంతా కలిసి ఉండేందుకు మరో చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. వీరి పిల్లల ఇళ్లలో టాయిలెట్స్ లేవు. అందుకని వారికోసం ప్రత్యేకంగా టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. అది కూడా చిన్నపాటి ఇల్లులా ఉంటుంది.
ఐదేళ్ల క్రితం బ్రింక్స్ కుటుంబం సుస్థిరమైన జీవనాన్ని గడపాలని మిషిగన్‌లోని తమ 2,200 చదరపు అడుగుల ఇంటిలోకి మారాలనుకున్నారు. అయితే, చిన్న ఇల్లు అయితేనే బాగుంటుందని తర్వాత మనసు మార్చుకున్నారు. 'చిన్న ఇళ్లలో చాలా తక్కువ చెత్త ఉంటుంది. తక్కువ హీట్ అవసరమవుతుంది. అలాగే పర్యావరణానికి చాలా మేలు కలుగుతుంది' అని ఆ కుటుంబం చెబుతోంది. 'మొదటగా నా భర్త.. అందరం ఒకే ఇంట్లో కలిసుందాం అని అన్నారు. కానీ వ్యక్తిగత గోప్యత అనేది అవసరం అని నేను అన్నాను. అందుకే ప్రత్యేకంగా ఎవరి ఇల్లు వారికి ఉండేలా చిన్న ఇళ్లను కొన్నాం' అని కేలి చెబుతున్నారు.