PM Denamrk Visit: ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. రెండు దేశాలు వెంటనే చర్చల మార్గంలోకి రావాలని కోరారు. డెన్మార్క్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌తో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చించారు. గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం తదితర అంశాలపై సమాలోచనలు చేశారు.
Modi Meeting with Danish PM: ఈ సమావేశంలో పలు అంశాలపై రెండు దేశాలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మోదీ.. ఇండియా-ఈయూ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై చర్చలు త్వరలోనే ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కోసం సంయుక్త కార్యాచరణపై సమీక్షించినట్లు తెలిపారు. తమ భేటీలో ఉక్రెయిన్ అంశం సైతం ప్రస్తావనకు వచ్చిందన్న మోదీ... వెంటనే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. దౌత్యం ద్వారా మాత్రమే వివాదాన్ని పరిష్కరించుకోగలమని సూచించారు. అటు భారత తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని, మరణాలను ఆపేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఒప్పించాలని డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ కోరారు.