Prigozhin Death US Intelligence Report :వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్‌ను ఉద్దేశపూర్వక పేలుడుతోనే హత్యచేశారని అమెరికా నిఘావర్గాలు అంచనా వేశాయి. తన వ్యతిరేకుల నోరు మూయించే చరిత్ర ఉన్న పుతిన్ వైఖరి వల్లేప్రిగోజిన్ విమానంలో పేలుడు జరిగిందని భావిస్తున్నట్లు.. పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారి వెల్లడించారు. సాధారణంగా ప్రత్యర్థులకు దాడిచేసే అవకాశం ఇవ్వని ప్రిగోజిన్.. తనతో పాటు తన తర్వాత స్థాయిలో ఉండే లెఫ్టినెంట్స్‌ను కూడా వెంట తీసుకుని వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వాగ్నర్ గ్రూపు.. రష్యాపై తిరుగుబాటు చేసినందుకు పుతిన్ ప్రతీకారం తీర్చుకున్నారనే విమర్శలు రష్యాలో వినిపిస్తున్నాయి.
మరోవైపు, వాగ్నర్ గ్రూప్ అనుకూల వార్తా ఛానెళ్లలో ప్రిగోజిన్ హత్యపై పలు కథనాలు ప్రసారమయ్యాయి. ప్రిగోజిన్‌ది హత్యేనని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. క్షిపణిని ప్రయోగించి ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేశారని అన్నారు. విమానం రాయిలా కిందపడుతున్న దృశ్యాలను విడుదల చేశారు. అయితే, వీరి ఆరోపణలు నిర్ధరణ కాలేదు.
Prigozhin Death Putin Speech :ఇదేసమయంలో విమాన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం ప్రకటించారు. ప్రిగోజిన్ ఎన్నో తప్పులు చేసినప్పటికీ.. ఎంతో ప్రతిభ గల వ్యక్తి, వ్యాపారి అని పుతిన్ పేర్కొన్నారు. విమాన ప్రమాదంపై దర్యాప్తునకు.. కొంచెం సమయం పడుతుందన్నారు. ప్రిగోజిన్, ఇతర వాగ్నర్ గ్రూప్ సభ్యులు ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరులో.. ప్రముఖ పాత్ర పోషించారని పుతిన్ చెప్పారు. వారి సహాయాన్ని మర్చిపోలేమన్నారు.
రష్యా మీడియా కవరేజీ..
Russian Media On Prigozhin Death :వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ వార్తను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు విస్తృత కవరేజీ ఇచ్చాయి. కానీ రష్యా మీడియా మాత్రం అంతగా స్పందించలేదు. రష్యా జాతీయ మీడియా సంస్థలైన రష్యా 24, రష్యా 1 టీవీ ఛానెళ్లు.. విమాన ప్రమాదం దర్యాప్తు గురించి మాత్రమే వివరించాయి. దీంతో పాటు దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్‌గా పుతిన్ పాల్గొనడంపై కూడా విస్తృతమైన కవరేజీ ఇచ్చాయి.