Prigozhin Death Russia President Putin :'నేను దేనినైనా క్షమిస్తాను కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం క్షమించను' రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివి. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రత్యర్థులను తనకు ఎదురు తిరిగిన వారిని అంత తేలిగ్గా వదిలిపెట్టరని పేరున్న పుతిన్.. వాగ్నర్ తిరుగుబాటును వెన్నుపోటుగా, రాజద్రోహంగా అభివర్ణించారు. అయినా ప్రిగోజిన్‌ను మాత్రం వెంటనే క్షమించారు. తిరుగుబాటు పూర్తయిన రెండు నెలల తర్వాత ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. కానీ, పలు ఇంటెలిజెన్స్ సంస్థలు, అగ్రదేశాల నాయకులు మాత్రం ప్రిగోజిన్ హత్యేనని, దీని వెనక పుతిన్ హస్తం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రిగోజిన్‌ను పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసి.. ప్రమాదంలా చిత్రీకరిస్తున్నారని అమెరికా సహా చాలా దేశాలు అనుమానిస్తున్నాయి.
Prigozhin Death America Prediction :వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్‌నుహత్య చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. కూలిపోవడానికి ముందే విమానంలో భారీ పేలుడు జరిగి ఉంటుందని పేర్కొంది. క్షిపణిని ఉపయోగించి విమానాన్ని కూల్చేశారనే వాదనను అమెరికా నిఘా వర్గాలు కొట్టిపారేశాయి. విమానంలో పేలుడు వల్ల ప్రిగోజిన్ మరణించి ఉంటాడని పెంటగాన్ ప్రతినిధి పాట్ రైడర్ అభిప్రాయపడ్డారు. ప్రిగోజిన్‌ది హత్యేనని వాగ్నర్ సంస్థకు చెందిన గ్రేజోన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా వెల్లడించింది.
ఈ ప్రమాదంలో ప్రిగోజిన్‌తో పాటు దిమిత్రి ఉత్కిన్, వాగ్నర్ లాజిస్టిక్స్ విభాగం అధిపతి, సిరియాలో గాయపడిన వాగ్నర్ సభ్యుడు, అంగరక్షకులు, విమాన సిబ్బంది ఉన్నారు. సాధారణంగా సైనిక దళాల టాప్ లీడర్లు ఒకే విమానంలో ఎప్పుడూ ప్రయాణం చేయరు. కానీ, ఇక్కడ వాగ్నర్ గ్రూపులోని కీలక నాయకులంతా ఒకే విమానంలో సెయింట్ పీటర్స్ బర్గ్‌కు ఎందుకు బయల్దేరారన్నది కూడా తెలియడం లేదు. ప్రత్యక్ష సాక్షులు రెండు పేలుళ్లను విన్నట్లు గార్డియన్ పత్రిక కథనంలో పేర్కొంది. ఇవన్నీ ప్రిగోజిన్‌ది హత్యే అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అమెరికా నిఘా సంస్థ తెలిపింది.
ఈ ఏడాది జూన్ 23వ తేదీన ప్రిగోజిన్ రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దానిని ఉపసంహరించుకొని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రాజీపడ్డారు. ఈ ఘటనకు సరిగ్గా రెండు నెలలు పూర్తయిన సమయంలో ప్రిగోజిన్ విమానం కూలి మరణించారు. వాస్తవానికి వాగ్నర్ బృందానికి చెందిన మరో విమానం కూడా మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణించింది. ఫ్లయిట్ రాడార్ 24 సంస్థ కూడా ప్రిగోజిన్ విమానం ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయింది. దీంతో అక్కడ జామర్లు ఉన్నాయని భావిస్తున్నారు. మరో విధానంలో విమానం ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. ఈ మార్గంలో కుంజెంకినో-2 మిలటరీ బేస్ ఉంది.