Prigozhin Death Confirm :రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారని రష్యా విచారణ కమిటి అధికారికంగా నిర్ధరించింది. ఫోరెన్సిక్ పరీక్షలన్నీ జరిపిన తర్వాత ప్రమాదంలో చనిపోయింది ప్రిగోజినే అని కమిటీ తేల్చింది. స్వాధీనం చేసుకున్న 10 మృతదేహాలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది. కానీ విమానం ఎలా క్రాష్ అయ్యింది అన్న విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ 10 మంది ప్రిగోజిన్‌కు నమ్మకస్తులైన అత్యున్నత స్థాయి లెఫ్టినెంట్లు అని ఇప్పటికే రష్యా పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
Prigozin Plane Crash : ఆగస్టు 23 (బుధవారం) మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌కు బయల్దేరిన విమానం కూలి ప్రిగోజిన్ సహా వాగ్నర్ గ్రూప్‌లో కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఏడుగురు ప్రయాణికులు సహా ముగ్గురు విమాన సిబ్బంది మరణించారు. కానీ, అగ్రదేశాల నాయకులు, పలు ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రం ప్రిగోజిన్‌ది హత్యేనని.. దీని వెనక పుతిన్ హస్తం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రిగోజిన్‌ను పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసి.. ప్రమాదంలా చిత్రీకరిస్తున్నారని అమెరికా సహా చాలా దేశాలు అనుమానిస్తున్నాయి.
Prigozhin Death America Prediction : వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్‌ను హత్యచేశారని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. కూలిపోవడానికి ముందే విమానంలో భారీ పేలుడు జరిగి ఉంటుందని పేర్కొంది. క్షిపణిని ఉపయోగించి విమానాన్ని కూల్చేశారనే వాదనను అమెరికా నిఘా వర్గాలు కొట్టిపారేశాయి. విమానంలో పేలుడు వల్ల ప్రిగోజిన్ మరణించి ఉంటారని పెంటగాన్ ప్రతినిధి పాట్ రైడర్ అభిప్రాయపడ్డారు. ప్రిగోజిన్‌ది హత్యేనని వాగ్నర్ సంస్థకు చెందిన గ్రేజోన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా వెల్లడించింది.