Queen Elizabeth Funeral : బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్ 2.. అంత్యక్రియలకు హాజరుకానున్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. భారత్ తరఫున ద్రౌపదీ ముర్ము రాణికి నివాళులు అర్పిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపదీ ముర్ముకు ఇదే తొలి విదేశీ పర్యటన కానుంది. ఈనెల 17 నుంచి 19 వరకు ద్రౌపదీ ముర్ము లండన్లో పర్యటించనున్నారు.
క్వీన్ ఎలిజబెత్ 2 ఈ నెల 8న మరణించగా.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి విచారం వ్యక్తం చేశారు. దిల్లీలోని బ్రిటీష్ రాయబార కార్యాలయానికి వెళ్లిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్.. భారత్ తరఫున సంతాపం తెలియజేశారు. క్వీన్ ఎలిజబెత్ 2 మరణానికి సంఘీభావం తెలుపుతూ భారత్లో ఈనెల 11న సంతాప దినంగా పాటించారు.