కరోనా మహమ్మారి అత్యవసర స్థితి దశ ముగిసిపోయిందని చెప్పడం తొందరపాటే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. చైనాలో కరోనా వైరస్ విజృంభణ వినాశకర స్థాయిలో ఉండే సూచనలు కనిపిస్తున్నందున కొవిడ్ ముగిసిపోలేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారులతోపాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శాస్త్రవేత్తలూ ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. మహమ్మారి ముగింపు దశలో ఇది 'వైల్డ్ కార్డు' ఎంట్రీనే! - వైల్డ్ కార్డు చైనా కొవిడ్
చైనాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురిచేస్తోంది. మహమ్మారి ముగిసిపోతోందని భావిస్తోన్న సమయంలో చైనాలో ఇది వైల్డ్ కార్డేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జీరో కొవిడ్ విధానానికి ముగింపు పలికిన చైనా.. కొవిడ్ విజృంభణను కట్టడి చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడి ఆసుపత్రుల్లో కొవిడ్ మరణాలకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో వేల సంఖ్యలో కొవిడ్ మరణాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం మహమ్మారి కీలక దశలో ఉన్నామని అర్థమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కొవిడ్ ఎమర్జెన్సీ కమిటీలో సలహాదారుడిగా ఉన్న డచ్ వైరాలజిస్ట్ మేరియన్ కూప్‌మన్స్ పేర్కొన్నారు. ఇప్పటివరకు చైనాలో పెండింగులో ఉన్న ఈ మహమ్మారి విజృంభణ తన దృష్టిలో 'వైల్డ్ కార్డు' అని అన్నారు.
ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి మరికొద్ది రోజుల్లో ముగింపు దశకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథోనోమ్ ఇటీవల అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదిలో ఇది ముగిసిపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. అంతర్జాతీయ స్థాయిలో పరిస్థితులను సమీక్షించిన తర్వాత అత్యయిక స్థితిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదే సమయంలో చైనాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి అప్రమత్తం అవుతున్నాయి.