విశ్రాంత పోప్ బెనెడిక్ట్-16 కన్ను మూశారు. 95ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం 9.34 గంటలకు ఆయన మరణించినట్లు వాటికన్ ప్రతినిధులు తెలిపారు. జర్మన్ వేదాంతి అయిన బెనెడిక్ట్.. 600ఏళ్ల చరిత్రలో రాజీనామా చేసిన తొలి పోప్గా నిలిచారు.
విశ్రాంత పోప్ బెనెడిక్ట్ కన్నుమూత.. సంతాపం తెలిపిన మోదీ - విశ్రాంత పోప్ బెనెడిక్ట్ మృతిపై మోదీ సంతాపం
విశ్రాంత పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వాటికన్ ప్రతినిధులు ప్రకటించారు. బెనెడిక్ట్ మరణంపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
పోప్ బెనెడిక్ట్-16 మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అతను సమాజానికి గొప్ప సేవలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. "తన జీవితమంతా చర్చికి, క్రీస్తు బోధనలకు అంకితం చేసిన పోప్ ఎమిరిటస్ బెనెడిక్ట్ మరణం చాలా బాధాకరం. సమాజానికి చేసిన గొప్ప సేవల్లో ఆయన చిరస్మరణీయులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆయన అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ ప్రధాని ట్వీట్ చేసారు.
క్యాథలిక్ మతాధిపతి పోప్ బెనెడిక్ట్ 2013లో తన పదవికి రాజీనామా చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. 600ఏళ్లలో పోప్ పదవిని త్యజించిన తొలి వ్యక్తిగా బెనెడిక్ట్ నిలిచారు. రాజీనామా అనంతరం ఆయన వాటికన్ గ్రౌండ్స్ కాన్వెంట్‌లోనే నివసిస్తున్నారు. ఆయన తర్వాత ఫ్రాన్సిస్ ఆ పదవిని చేపట్టారు. బెనెడిక్ట్ అంత్యక్రియలు పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన వాటికన్‌లోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.