POK Protest Against Pakistan : పాకిస్థాన్ పాలకులపై పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆగ్రహం.. కట్టలుతెంచుకుంటోంది. నిత్యావసరాల ధరల భారం, ఉద్యోగాల్లో నియామకాలు, వేతనాల వంటి అంశాల్లో పాక్ పాలకులపై స్థానికులు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. విద్యుత్ విషయంలోనూ తమకు తీవ్ర అన్యాయంపై జరుగుతుండటం వల్ల ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు.
పాకిస్థాన్‌లో "మెజారిటీ విద్యుత్ ఉత్పత్తి" పీఓకే ప్రాంతంలో జరుగుతోంది. అయినా వీరి నుంచే పాక్ ప్రభుత్వం అధికంగా విద్యుత్ ఛార్జీలను వసూలు చేస్తోంది. సరఫరా చేస్తున్న విద్యుత్‌లో నాణ్యత ఉండటం లేదు. తరచూ విద్యుత్ కోతలు విధిస్తుండటం వల్ల స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో తమ ప్రాంతంలో తయారైన విద్యుత్‌పై కొంతశాతం ఓనర్ షిప్ కావాలని పీఓకే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
"ఎక్కువ విద్యుత్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉత్పత్తవుతోంది. కానీ ఇక్కడి ప్రజలకే విద్యుత్ సరఫరా లేక లోడ్ షడ్డింగ్ సమస్యను అనుభవిస్తున్నారు. అంతేకాక ఇక్కడి ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీలు విధిస్తున్నారు. ఇక్కడ 4వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. పీవోకేలో 24 గంటల విద్యుత్ సరఫరాకు 400 మెగావాట్ల విద్యుత్ అవసరం. మంగ్లా డ్యామ్‌ను నిర్మించినప్పుడు ఇస్లామాబాద్ పాలకులు.. పీఓకే ప్రభుత్వంతో ఉచిత విద్యుత్ అందిస్తామని ఒప్పందం చేసుకున్నారు. నీలమ్-జీలం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం క్రమంలో అలాంటి ఒప్పందాలేం చేసుకోలేదు. పీఓకే ప్రజల డబ్బుతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించారు. పీఓకేలో చాలా నదులు ఉన్నాయి. అక్కడ విద్యుత్ ఉత్పత్తి కోసం పలు ప్రాజెక్టులను పాక్ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందుకోసం స్థానికులే ఎక్కువ పన్ను చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. దీంతో స్థానికులు విద్యుత్ ఛార్జీల చెల్లింపులను బహిష్కరించారు."
--సయ్యద్ వాకర్, ఆందోళనకారుడు