POK Protest Against Pakistan :పాకిస్థాన్ పాలకులకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు.. తమ నిరసన గళం ఐక్యరాజ్యసమితి వరకు వినిపించారు. జెనీవాలోని ఐరాస మానవ హక్కుల మండలి 54వ సమావేశాలు జరుగుతున్న సమయంలో POKకు చెందిన కొందరు రాజకీయ కార్యకర్తలు.. ఇస్లామాబాద్ పాలకులకు వ్యతిరేకంగా భారీ నిరసనలు చేశారు. వెంటనే కశ్మీర్‌ను పాకిస్థాన్ ఖాళీ చేసి శాంతియుత జీవితం గడిపేందుకు తమకు సహకరించాలని నినాదాలు చేశారు.
యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ (UKPNP) కార్యకర్తలు.. సోమవారం ఐరాస వెలుపల జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. గిల్గిత్ బాల్టిస్థాన్‌లో గత కొద్దినెలలుగా పెచ్చుమీరిన ద్రవ్యోల్బణం, ఉగ్రవాదాన్ని నిరసిస్తూ ప్రజలు వీధుల్లోనే ఉంటున్నారని యూకేపీఎన్పీ అధికార ప్రతినిధి నాసిర్ అజీజ్ ఖాన్ గుర్తుచేశారు. లోడ్‌షడ్డింగ్ సమస్యతో పాటు వనరుల దోపిడీ, పాక్ గూఢచార సంస్థ చేపడుతున్న పనులపై ఆందోళనలు చేశారు. భారీ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వీధుల్లోకి ప్రజలు వస్తున్నట్లు చెప్పారు.
జమ్ముకశ్మీర్ చారిత్రక ప్రాంతమని, దానిని పాకిస్థాన్ బలవంతంగా విభజించిందని UKPNP ఛైర్‌పర్సన్ షౌకత్ అలీ కశ్మీరీ తెలిపారు. పీఓకే ప్రజలు.. ఆరు నెలలకుపైగా నిరసనలు చేస్తున్నట్లు తెలిపారు. పీఓకేలో పాక్ గూఢచార సంస్థలు.. స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలను వేధిస్తున్నట్లు ఆరోపించారు. పాక్ విధానాల వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని.. ఐరాస స్పందించాలని తాము కోరుతున్నామన్నారు. పాకిస్థాన్ మానవహక్కులను హరిస్తోందని UKPNP విదేశాంగ కార్యదర్శి జమీల్ మక్సూద్ అన్నారు. అనంత్ నాగ్, సోపోర్, ఉరి తదితర ప్రాంతాల్లో పాక్.. అమాయక ప్రజలు చంపేస్తోందని తెలిపారు.
బలూచ్ ప్రజల ఆవేదన
మరోవైపు, బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ ఆగడాలను నిరసిస్తూ అక్కడి పౌరులు స్విట్జర్లాండ్ జెనీవాలోని ఐరాస మానవహక్కుల కార్యాలయం ముందు పోస్టర్ల ప్రదర్శన నిర్వహించారు. బలూచ్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది కనిపించకుండా పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దయనీయంగా POK ప్రజల జీవితాలు
POK People Situation :అయితే గత కొద్దినెలలుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పౌరుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పుష్కలంగా ఉన్న ఇక్కడి వనరులను పాకిస్థాన్ దోచుకుంటుందనీ.. కనీసం బతికే అవకాశాలను తమకు ఇవ్వడం లేదని పీఓకే ప్రజలు వాపోతున్నారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు చేస్తున్న ఆందోళనలను పాక్ పాలకులు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. అనధికార విద్యుత్ కోతలతో పీఓకేలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చాలా ప్రదేశాల్లో రోజుకు కొన్ని గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తుండటం.. వీరి బతుకులను అంధకారం వైపు నడిపిస్తోంది. పాకిస్థాన్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే పీఓకేలో అత్యధిక విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నారు. పీఓకేలో 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగితే.. అందులో తాము బతకడానికి కనీసం 400 మెగావాట్ల విద్యుత్ అయినా కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.