POK Protest Against Pakistan : పీవోకే పౌరులపై సవతి ప్రేమ చూపిస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్‌లోని ఇతర ప్రాంతాల వలె తమనూ చూడాలన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ పీవోకే వాసులు ఆందోళనలు చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలని లోడ్ షెడ్డింగ్‌ను పరిష్కరించాలనీ.. గోధుమ పిండిపై రాయితీని పునరుద్ధరించాలనీ కోరుతున్నారు.
పీవోకేలో విద్యుత్ బిల్లులు పాక్‌లోని ఇతర ప్రాంతాల కన్నా ఎక్కువ ఉన్నాయని స్థానికులు కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్నారు. వేలమంది వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీవోకేలో రోజుకు 18గంటల విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో విద్యాసంస్థలు, వ్యాపారాలు, నివాసాలు, ఆస్పత్రులు ఇలా అన్ని రంగాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో నలిగిపోతున్న క్రమంలో పాక్ చూపుతున్న ఈ వివక్ష పీవోకే పౌరులను మరింత కలవరపెడుతోంది. శాంతియుత నిరసనలు చేస్తే సైన్యం, పోలీసులతో అణచివేస్తున్నారు. పీవోకే పూంచ్ ప్రాంతంలో నిరసన తెలిపిన యువకులపై కాల్పులు జరిపిన ఘటనలు కూడా గతంలో వెలుగు చూశాయి.