Poison Attack On Dawood Ibrahim :పరారీలో ఉన్న ముంబయి పేలుళ్ల సూత్రధారి, అండర్‌వరల్డ్ డాన్, దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అతడిపై విషప్రయోగం జరిగినట్లు సమాచారం. దావూద్‌కు భారీ భద్రత మధ్య ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు మీడియాలో కథనాలు (Dawood Ibrahim Latest News) వస్తున్నాయి. అయితే దావూద్ రెండు రోజుల క్రితమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆ ఆస్పత్రి ఫ్లోర్లో అందరిని ఖాళీ చేయించి దావూద్‌కు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. వైద్యులు, అతడి కుటుంబ సభ్యులను మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ముంబయి పోలీసులు దావూద్ బంధువుల దగ్గరి నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Internet Down In Pakistan Now :మరోవైపు, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు సమాచారం. యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లు కూడా డౌన్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు పాక్‌లోని మీడియా సంస్థల కథనాలు వెల్లడించాయి.
దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకుని కరాచీలో నివసిస్తున్నట్లు అతడి బంధువులు తెలిపినట్లు ఈ ఏడాది జనవరిలో వార్తలు వచ్చాయి. అతడి మేనల్లుడు అలిషా పార్కర్ దావూద్ కుటుంబం గురించి పూర్తి వివరాలు వెల్లడించినట్లు సమాచారం. కరాచీలోనే వేరే ప్రదేశానికి మారినట్లు తెలుస్తోంది.