Pneumonia Outbreak In China : చిన్నారుల్లో న్యుమోనియా కేసుల పెరుగుదలకు కొత్త వైరస్ కారణం కాదని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక నివేదికను సమర్పించింది. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని నివేదికలో పేర్కొంది. శరవేగంగా వ్యాపించిన శ్వాసకోశ సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేవలం 24 గంటల్లోనే చైనా కచ్చితమైన సమాచారాన్ని అందించిందని ఆ దేశానికి చెందిన సీజీటీఎన్ మీడియా తెలిపింది. బీజింగ్, లియోనోంగ్లో చేసిన పరీక్షల్లో ఎటువంటి కొత్త వైరస్ను గుర్తించలేదని పేర్కొంది.
చిన్నారుల్లో న్యుమోనియా కేసులు పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) అధికారులతో టెలికాన్పరెన్స్ నిర్వహించింది. అలానే బీజింగ్ పిల్లల ఆసుపత్రి నుంచి కూడా సమాచారం కోరింది. ఈ విషయంపై ఆసుపత్రి శ్వాసకోస విభాగం డైరెక్టర్ ఝావో షన్నియింగ్ మాట్లాడారు. " మేము సీడీసీ నుంచి పొందిన డేటా ప్రకారం మైకోప్లాస్మాలో ఎటువంటి మార్పు లేదు. మైకోప్లాస్మా నిమోనియా చైనాలో చాలా ఏళ్ల నుంచి ఉనికిలో ఉంది. దీనికి కచ్చితమైన రోగ నిర్ధారణ లేదు. కానీ, మాకు ఈ చికిత్సలో చాలా అనుభవం ఉంది. ప్రారంభ దశలోనే చికిత్సను అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు." అని శ్వాసకోస విభాగం డైరెక్టర్ పేర్కొన్నారు.