Pneumonia Outbreak In China :కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాలో మరో వ్యాధి అక్కడి ప్రజలను వణికిస్తోంది. చైనాలోని పాఠశాలల్లో అంతుచిక్కని న్యుమోనియా విజృంభిస్తోంది. చిన్నారులు అంతుచిక్కని వ్యాధి లక్షణాల బారిన పడుతున్నారు. ఇన్‌ఫెక్షన్, శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరం వంటి లక్షణాలతో వందలాది మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్ అనే సంస్థ బయటపెట్టింది.
'ఆస్పత్రుల్లో చేరుతున్న వందల మంది చిన్నారులు'
బుధవారం నాడు అనారోగ్యానికి గురైన చిన్నారులతో బీజింగ్, లియనోనింగ్ ప్రాంతాల్లోని ఆస్పత్రులు నిండిపోయాయని ఆ సంస్థ పేర్కొంది. దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, శ్వాస సంబంధిత ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని తెలిపింది. ఒకేసారి వందల మంది పిల్లలు అనారోగ్యానికి గురికావడం అసాధారణ విషయమని.. ఈ జబ్బు ఎప్పుడు, ఎలా పుట్టుకొచ్చిందో స్పష్టత లేకపోయినా.. పాఠశాలలోనే వ్యాప్తి చెంది ఉండొచ్చని ప్రోమెడ్ సంస్థ పేర్కొంది. అలాగే పెద్దలు ఈ వ్యాధికి గురయ్యారా లేదా అన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు. మరో మహమ్మారిగా ఇది మారుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరించింది.
అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO)
చైనాలోని చిన్నారుల్లో న్యుమోనియా కేసులు పెరుగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ- WHO అప్రమత్తమైంది.దీనిపై పూర్తి వివరాలు తెలియజేయాలని.. చైనాను కోరింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురవుతున్న చిన్నారులు ఉండే ప్రాంతాల వివరాలు ఇవ్వాలని WHO పేర్కొంది.