Modi SCO Summit : ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నానని మోదీ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఎస్సీఓ సభ్య దేశాలు.. ఒకదానికొకటి ట్రాన్సిట్ యాక్సెస్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
"మేము దేశ ప్రజల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. ప్రతీ రంగంలో ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్నాం. నేడు భారత్‌లో 70 వేల కంటే ఎక్కువ స్టారప్ కంపెనీలు, 100కుపైగా యూనికార్న్‌లు ఉన్నాయి. కొవిడ్ మహ్మమారిని ప్రపంచం అధిగమిస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలకు సరఫరాల విషయంలో అనేక అంతరాయాలు ఏర్పడ్డాయి. కాబట్టి భారత్‌ను ఓ తయారీ కేంద్రంగా మార్చాలని అనుకుంటున్నాం. గుజరాత్‌లో సంప్రదాయ ఔషధాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో.. మొట్టమొదటి గ్లోబల్ సెంటర్‌ను ప్రారంభించింది."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి
వచ్చే ఏడాది షాంఘై సహకార సంస్థ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు. తాము సదస్సు విషయంలో పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.