PM Modi US Visit : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. మంగళవారం ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన ప్రధాని మోదీ.. బుధవారం నుంచి అగ్రరాజ్యంలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. భారత్, అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలంగా, సుసంపన్నంగా మార్చేందుకు ఈ పర్యటన ఒక అవకాశం కానుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచం ముందున్న సవాళ్లను ఎదుర్కొనే దిశగా కలిసి పనిచేసేందుకు రెండు దేశాలు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ నుంచి అందిన ఈ ప్రత్యేక ఆహ్వానం 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్య శక్తికి ప్రతిబింబమని పేర్కొన్నారు.
'ద్వైపాక్షిక భాగస్వామ్యాంతో పాటు జీ-20, క్వాడ్, ఇండోపసిఫిక్ ఆర్థిక ఫ్రేమ్‌వర్క్ సదస్సులలో ఇరు దేశాలు ఏకీకృతం అయ్యేందుకు ఈ చర్చలు అవకాశం కల్పిస్తాయి. న్యూయార్క్‌తో నా అమెరికా పర్యటనను ప్రారంభించనున్నా. జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొంటాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్న తన ప్రతిపాదనకు 2014లో మద్దతిచ్చిన అమెరికాలో తాను ఈ ఏడాది యోగా డే నిర్వహించుకోవం ఆనందంగా ఉంది'
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
చైనాతో శాంతి అవసరం.. : మోదీ
PM Modi Interview : ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల కోసం సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత నెలకొనడం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, చట్ట నియమాలను పాటించడం, విభేదాలు, వివాదాల శాంతియుత పరిష్కారంపై తమకు నమ్మకం ఉందన్నారు. అదే సమయంలో సార్వభౌమత్వం, గౌరవం కాపాడుకునేందుకు భారత్ పూర్తి నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు.
అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని వ్యాఖ్యానించారు మోదీ. దౌత్యం, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని.. యుద్ధం పరిష్కారం కాదని అన్నారు. కొందరు భారత్ తటస్థంగా ఉందని అంటారని.. కానీ అది నిజం కాదని.. భారత్ శాంతివైపు ఉందన్నారు. భారత్ అత్యంత ప్రాధాన్యత శాంతి అని ప్రపంచానికి పూర్తి విశ్వాసం ఉందన్నారు. భారత్, అమెరికా నేతల మధ్య అపూర్వమైన నమ్మకం ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెల్లడించారు.
Narendra Modi America Tour : అమెరికాలోని న్యూయార్క్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఖగోళ శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్, గ్రామీ అవార్డు గ్రహీత, ఇండో అమెరికన్ గాయని ఫాలు (ఫల్గుణి షా) సహా.. నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు సహా పలు రంగాలకు చెందిన నిపుణులను కలవనున్నారు.
Modi US Visit 2023 Agenda : న్యూయార్క్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొని.. అక్కడి నుంచి వాషింగ్టన్ వెళ్లనున్నట్లు మోదీ తెలిపారు. వాణిజ్యం, టెక్నాలజీ, సృజనాత్మకత వంటి పలు రంగాల్లో ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రక్షణ రంగంలో ఇరు దేశాల పరస్పర సహకారం దిశగా ముందడుగు వేసే ప్రణాళికతో ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జరిగే చర్చల్లో.. రక్షణ పరిశ్రమల రంగంలో ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి రోడ్డు మ్యాప్ రూపొందనుంది.
Narendra Modi US Visit Schedule : ఈ అధికారిక పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించనున్నారు. అంతేకాకుండా అమెరికా కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. యూఎస్ కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోదీ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో పర్యటన ముగిసిన తర్వాత మోదీ నేరుగా ఈజిప్టునకు వెళ్లనున్నారు. జూన్ 25న రెండు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి భారత్ చేరుకోనున్నారు.