PM Modi US Visit : ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎటువంటి సందేహాలకు తావు ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతినిధుల సభలో గంట పాటు ప్రసంగించిన మోదీ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు గడిచాయని , '26/ 11' దాడులు జరిగి దశాబ్దం గడుస్తున్నా రాడికలిజం, ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
చైనాపై కూడా ప్రధాని మోదీ పరోక్ష దాడికి దిగారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై గౌరవం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడంపైనే గ్లోబల్ ఆర్డర్ ఆధారపడి ఉందని చైనాను ఉద్దేశించి మోదీ అన్నారు. మరోవైపు.. తాను ప్రధానిగా మొదటిసారి అమెరికాను సందర్శించినప్పడుభారత్.. ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని.. ప్రస్తుతం 5వ స్థానంలో ఉందని తెలిపారు.
"నేను ప్రధానమంత్రిగా మొదటిసారిగా అమెరికాను సందర్శించినప్పుడు భారత్.. ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రస్తుతం.. భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. మేము పెద్దగా ఎదగడమే కాకుండా తొందరగా అభివృద్ధి చెందుతున్నాము. భారతదేశం అభివృద్ధి చెందితే.. ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుంది."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను ప్రతీ దేశం గౌరవించాలని ప్రధాని మోదీ సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అంతర్జాతీయ సంస్థలు మారాలని.. ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అత్యవసరమని గుర్తు చేశారు. మోదీ ప్రసంగం ఆద్యంతం చప్పట్లతో సభ మార్మోగింది. మోదీ.. మోదీ అంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రసంగం అనంతరం.. మోదీ ఆటోగ్రాఫ్ తీసుకున్న సభ్యులు ఆయనతో సెల్ఫీలు దిగారు.
Narendra Modi US Congress Speech : అమెరికాలో లక్షలాది మంది భారతీయులు ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రతినిధుల సభను ఉద్దేశించి ప్రసంగించడం ఎల్లప్పుడూ గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పారు. 'రెండుసార్లు యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. 140 కోట్ల భారత ప్రజల తరఫున అమెరికాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది యుద్ధ యుగం కాదు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి. రక్తాపాతాన్ని ఆపడానికి అందరూ కృషి చేయాలి. ప్రపంచ దేశాలు.. భారత్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాయి.' అని ప్రధాని మోదీ అమెరికా ప్రతినిధుల సభలో మాట్లాడారు.
వైట్‌హౌస్‌లో విందు..
White House Dinner Modi : అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకిఆ దేశ అధ్యక్షుడు జో బెడెన్ శ్వేతసౌధంలో విందు ఇచ్చారు. మెనూలో, ఎక్కువగా శాకాహార వంటకాలు ఉన్నాయి. చిరుధాన్యాలు , స్టఫ్డ్ మష్రూమ్‌లు, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్ , యాలకులు కలిపిన స్ట్రాబెర్రీ షార్ట్‌కేక్ డిన్నర్‌లో ఉన్నాయి. ఈ విందుకు 400 మందికి పైగా ప్రముఖులను బైడెన్ దంపతులు ఆహ్వానించారు. ప్రధాని మోదీ పర్యటనలో ఆయనతో అద్భుతమైన సమయాన్ని గడిపినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. భారత్-అమెరికా మధ్య స్నేహ బంధాన్ని స్టేట్ డిన్నర్ ద్వారా వేడుక చేసుకున్నట్లు చెప్పారు.
విందు ఏర్పాటు చేసినందుకు బైడెన్‌కు మోదీ ధన్యవాదాలు చెప్పారు. పర్యటన విజయవంతం అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నందుకు ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా యువత 'నాటు నాటు' పాటకు నృత్యం చేస్తోందని అన్నారు. భారత్ నుంచి ఈ స్టేట్ డిన్నర్‌కు భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ హాజరయ్యారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సహా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సహా పలువురు వ్యాపారవేత్తలు కూడా విందులో పాల్గొన్నారు.