PM Modi US Visit : అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. అ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. వైట్ హౌస్‌లో ప్రధానికి బైడెన్ దంపతులు ఘనస్వాగతం పలికారు. పురాతన అమెరికన్ బుక్ గ్యాలీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోదీకి బైడెన్ బహూకరించారు. అనంతరం ఇరువురు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.
వైట్‌హౌస్‌లోకి వెళ్లే ముందు ఫొటోలు..
వైట్‌హౌస్‌లో ప్రవేశించే ముందు బైడెన్ దంపతులు, మోదీ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రధాని మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా కూడా వైట్‌హౌస్‌లోకి వెళ్లారు. అనంతరం బైడెన్ దంపతులు ఇచ్చిన విందులో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
జిల్ బైడెన్‌కు కాస్ట్లీ డైమండ్
ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడికి చందనపు చెక్కతో తయారుచేసిన పెట్టెను కానుకగా ఇచ్చారు. రాజస్థాన్‌కు చెందిన కళాకారులు చేసిన ఈ పెట్టెలో గణేషుడి ప్రతిమ, వెండితో రూపొందించిన దీపపు ప్రమిద ఉన్నాయి. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు 7.5 క్యారట్ల పచ్చ వజ్రాన్ని.. మోదీ కానుకగా అందజేశారు. ఈ 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ల్యాబ్‌లో రూపొందించారు. ఒక క్యారెట్ తయారీకి కేవలం 0.028 గ్రాముల కార్బన్‌ను మాత్రమే విడుదలవుతుంది. దీన్ని జెమోలాజికల్ ల్యాబ్ కూడా ధ్రువీకరించింది. వజ్రానికి ఉండే నాలుగు ప్రధాన లక్షణాలైన.. కట్, కలర్, క్యారెట్, క్లారిటీలను కలిగి ఉంది. భూమిలో లభించే సహజమైన వజ్రం మాదిరిగానే దీనికి రసాయన, ఆప్టికల్ లక్షణాలు ఉంటాయి.
Narendra Modi White House Visit : అంతకుముందు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా-భారత్ బంధంపై జిల్ బైడెన్ మీడియాతో మాట్లాడారు. యూఎస్-భారత్ భాగస్వామ్యం ప్రపంచ దేశాల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ప్రధాని మోదీ పర్యటనతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాలు ఒక చోటుకు తీసుకొచ్చినట్లు ఉందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని మోదీకి ఆతిథ్యానికి సంబంధించిన మెనూను ఆమె మీడియాకు తెలిపారు. ప్రధాని మోదీ శాకాహారి కనుక వంటలను తృణధాన్యాలతో తయారు చేసినట్లు జిల్ బైడెన్ తెలిపారు. చేపలను కూడా మెనూలో చేర్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు.
జో బైడెన్‌కు మోదీ కానుకగా ఇచ్చిన సామగ్రి
ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో సిద్ధం చేసిన డైనింగ్ హాల్
Modi America Tour : అమెరికా ప్రభుత్వ అధికారిక ఆహ్వానం మేరకు.. ఆ దేశానికి వెళ్లిన ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) వాషింగ్టన్‌కు చేరుకున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన అక్కడి నుంచి బయలుదేరి వాషింగ్టన్‌లో అడుగుపెట్టారు. అండ్రూస్ జాయింట్ బేస్ విమానాశ్రయంలో దిగిన మోదీ గౌరవ వందనం స్వీకరించారు.
జిల్ బైడెన్‌తో ప్రధాని మోదీ
వర్షం పడుతుండడం వల్ల రెయిన్ కోట్ ధరించిన మోదీ.. భారత్, అమెరికా దేశాల జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. ఫ్రీడం ప్లాజా హోటల్‌వద్ద మోదీకి స్వాగతం పలికేందుకు వర్షంలోనూ ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు. హోటల్ వెలుపల గర్బా, ఇతర జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. వాషింగ్టన్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోదీ న్యూయార్క్‌లోని ఐరాస శాంతి దూతల మెమోరియల్ అయిన వాల్ ఆఫ్ పీస్ వద్ద నివాళులర్పించారు.
మోదీకి స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులు