తెలంగాణ

telangana

ETV Bharat / international

'మోదీ అమెరికా పర్యటన చరిత్రలో నిలిచిపోతుంది.. క్వాడ్​లో భారత్ సహకారం భేష్' - మోదీ అమెరికా న్యూస్

PM Modi US visit : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. మోదీ టూర్ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. మరోవైపు, రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం పేర్కొంది.

US INDIA BLINKEN
US INDIA BLINKEN

By

Published : Jun 13, 2023, 8:11 AM IST

Updated : Jun 13, 2023, 9:01 AM IST

PM Modi US visit : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ దేశ పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. 21వ శతాబ్దానికి కీలకంగా నిలిచే భారత్- అమెరికా మధ్య సంబంధాలు ఈ పర్యటనతో మరింత బలోపేతం అవుతాయని అన్నారు. 'అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్' నిర్వహించిన 'ఇండియా ఐడియాస్ సమిట్' వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు అత్యంత కీలకమని చెప్పారు. భవిష్యత్ ఆవిష్కరణలు, వాటిని నియంత్రించే నిబంధనల రూపకల్పనలో ఇరుదేశాలు ప్రధాన భూమిక పోషిస్తాయని పేర్కొన్నారు. ఇరుదేశాల వ్యూహాత్మక సంబంధాలు రోజురోజుకూ మరింత మెరుగుపడుతున్నాయని స్పష్టం చేశారు.

"గతేడాది ఇరుదేశాల మధ్య వాణిజ్యం 191 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్​కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. అమెరికా కంపెనీలు భారత్​లో 54 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. తయారీ రంగం నుంచి టెలీకమ్యూనికేషన్స్ వరకు వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టాయి. భారత కంపెనీలు అమెరికాలో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ఐటీ, ఫార్మా సహా వివిధ రంగాల్లో 4.25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి. త్వరలోనే ప్రధాని మోదీ చారిత్రక పర్యటన ఉంది. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది."
-ఆంటోనీ బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి

సాంకేతికత ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని తాము విశ్వసిస్తామని పేర్కొన్న బ్లింకెన్.. అందుకే ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సాంకేతిక సంబంధాలను ప్రభుత్వ, వ్యాపార, విద్యారంగానికీ విస్తరించినట్లు తెలిపారు. భారత్​ వంటి విశ్వసనీయ దేశాలతో సప్లై చైన్ వ్యవస్థలు మెరుగుపడటం.. సహకారం పెరిగేందుకు దోహదం చేసిందని చెప్పారు. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్​వర్క్​లో భాగంగా.. మెరుగైన సప్లై చైన్, పరిశుద్ధ ఇంధనం, అవినీతిపై పోరాటం అనే మూడు అంశాలపై పనిచేసేందుకు భారత్ అంగీకరించడాన్ని బ్లింకెన్ స్వాగతించారు.

మరోవైపు, రక్షణ రంగంలో భారత్, అమెరికా మధ్య అత్యంత కీలకమైన భాగస్వామ్యం ఉందని శ్వేతసౌధం పేర్కొంది. జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమిలో భారత్, అమెరికా మధ్య సహకారం అత్యద్భుతంగా ఉందని కొనియాడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశంలో పర్యటించనున్నారు. వివిధ రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారంపై మోదీ, బైడెన్ చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీకి బైడెన్ విందు ఇవ్వనున్నారు. జూన్ 22న అధికారిక డిన్నర్ కార్యక్రమం ఉంటుందని శ్వేతసౌధం తెలిపింది.

Last Updated : Jun 13, 2023, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details