తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఫ్రాన్స్‌ నేషనల్‌ డే' వేడుకలకు స్పెషల్ గెస్ట్​గా మోదీ.. ఇప్పటి వరకు భారత్​ నుంచి ఇద్దరే!

PM Modi To Visit France : భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య దశాబ్దాలుగా దృఢమైన సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ పర్యటనతో ఇవి మరింత పటిష్టంగా మారనున్నాయి. జులై 13, 14 తేదీల్లో ఫ్రాన్స్‌లో పర్యటించనున్న మోదీ.. బాస్టిల్‌ డే వేడుకల్లో పాల్గొననున్నారు. బాస్టిల్ డే వేడుకలకు విదేశీ నేతలను సాధారణంగా ఫ్రాన్స్‌ ఆహ్వానించదు. అలాంటిది పదే పదే భారత నేతలకు ఫ్రాన్స్‌ స్వాగతం పలుకుతూ.. మన దేశంపై స్నేహ హస్తం చాస్తుంది. మోదీ రెండు రోజుల పర్యటనలో కీలక ఒప్పందాలు, చర్చలు కూడా జరగనున్నాయి. ఇవీ భారత్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని విదేశాంగ శాఖ ప్రకటించింది.

pm modi france visit
pm modi france visit

By

Published : Jul 12, 2023, 7:53 PM IST

PM Modi France Visit : ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. శుక్రవారం ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో గౌరవ అతిథిగా మోదీ పాల్గొననున్నారు. జులై 14న జరిగే బాస్టిల్ డే పరేడ్‌కు మోదీని అహ్వానించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. స్వయాన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ట్వీట్‌ చేశారు.

France Bastille Day Chief Guest : సాధారణంగా బాస్టిల్ డే పరేడ్‌ వేడుకలకు.. విదేశీ నేతలను ఆహ్వానించరు. చివరిసారిగా 2017లో బాస్టిల్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించారు. ఆ తర్వాత ఇప్పటివరకూ ఆహ్వానించలేదు. కానీ బాస్టిల్‌ డే వేడుకలకు భారత ప్రధానిని ఫ్రాన్స్ ఆహ్వానించడం ఇది రెండోసారి. 2009లో ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరవ్వగా.. ఇప్పుడు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. బాస్టిల్‌ డే వేడుకలకు పదే పదే భారత ప్రధానులను ఆహ్వానించడాన్ని చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత దృఢంగా ఉన్నాయో తెలుస్తుందని నిపుణులు అంటున్నారు.

Modi Macron Meeting : ఫ్రాన్స్‌ పర్యటనలో ప్రధాని కీలక చర్చలు జరపనున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలు, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, ఇండో-పసిఫిక్ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. భారత నౌకా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై మోదీ ప్రకటన చేసే అవకాశముంది. విమాన వాహక నౌక INS విక్రాంత్‌ కోసం ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ మొత్తం డీల్ విలువ 90 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వీటితోపాటు రక్షణ రంగంలో మరికొన్ని ఒప్పందాలు కూడా రెండు దేశాలూ కుదుర్చుకునే అవకాశముంది. వీటిలోనే సాంకేతిక మార్పిడి కూడా ఉంది. స్కార్పీన్ జలాంతర్గాముల కోసం మళ్లీ ఆర్డరు పెట్టాలని భారత్‌ను ఫ్రాన్స్ కోరుతోంది. నౌకా దళం కోసం ఎన్‌హెచ్90 హెలికాప్టర్లను కూడా కొనుగోలు చేయాలని ఫ్రాన్స్ కోరుతోంది. రక్షణ ఒప్పందాలతోపాటు కొన్ని వ్యూహాత్మక అంశాలు కూడా ఫ్రాన్స్, భారత్‌ మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.

అంతర్జాతీయ జలాల్లో పెరుగుతున్న చైనా ప్రాబల్యంపై భారత్‌-ఫ్రాన్స్‌ ఆందోళనతో ఉన్నాయి. దక్షిణాసియాలో పరిస్థితిపై కూడా మోదీ, మేక్రాన్‌ చర్చించే అవకాశముంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. భారత్‌తో కలిసి మల్టీ రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించింది. ఈ ఇంజిన్ల తయారీ ప్రక్రియను పూర్తిగా ఇండియాలోనే చేపట్టనున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికాతో కుదిరిన GE-414 ఇంజిన్ డీల్‌ తరహాలోనే ఈ ఒప్పందం కూడా ఉండనుంది.

ఈ ఏడాదితో భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మోదీ ఫ్రాన్స్ పర్యటన కీలక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌-ఫ్రాన్స్ ఇప్పటివరకు 35 కంటే ఎక్కువ వ్యూహాత్మక భాగస్వామ్యాలపై సంతకం చేశాయి.

ABOUT THE AUTHOR

...view details