రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సైనికపరమైన పరిష్కారం లభించదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత పరిస్థితులపై ఆయనతో చర్చించారు. శత్రుత్వాన్ని వీడి దౌత్యపరమైన చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
అన్ని దేశాల సమగ్రత, సార్వభౌమత్వానికి గౌరవం ఇవ్వాలని మోదీ స్పష్టం చేశారు. ఐరాస చార్టర్, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం చాలా ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా శాంతిస్థాపనకు భారత్ కృషి చేస్తుందని మోదీ ఉద్ఘాటించారు. శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు సహకారం అందించేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అణు యుద్ధం తీవ్ర ప్రమాదాలను తెచ్చి పెడుతుందన్నారు ప్రధాని మోదీ. అణు యుద్ధం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణం అతలాకుతలమవుతాయని హెచ్చరించారు.