PM Modi Russia Ukraine War : ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిష్కారానికి చర్చలు, దౌత్యమే మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మొదటి నుంచి భారత్ ఇదే విషయాన్ని చెబుతోందని ఆయన పేర్కొన్నారు. హిరోషిమాలో జీ-7 శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మానవత్వం, మానవీయ విలువలకు సంబంధించిన సమస్య అని తాను నమ్ముతున్నానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితిని రాజకీయాలు లేదా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యగా తాను పరిగణించనని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే.. ఆ ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా పడుతుందని ప్రధాని మోదీ అన్నారు.
ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినా.. ఆ ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా పడుతుంది. ప్రపంచ శాంతి, శ్రేయస్సు, స్థిరత్వమే జీ-7 దేశాల ఉమ్మడి లక్ష్యం. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం ప్రకారం అన్ని దేశాలు సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం చాలా అవసరం. వివాదాలు, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు తమ గళం వినిపించాలి.
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ కరచాలనం 'ఆటోగ్రాఫ్ మోదీజీ'
హిరోషిమాలో శనివారం జరిగిన క్వాడ్ సమావేశం ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికైంది. 'మీరు చాలా పాపులర్ కదా.. నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నా' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని మోదీతో అన్నారు. ఈ సందర్భంగా జో బైడెన్ తాను ఎదుర్కొంటున్న ఓ సవాల్‌ను మోదీ ముందుంచారట.
జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మోదీతో పాటు బైడెన్ పాల్గొనే కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారని బైడెన్.. ప్రధాని మోదీతో అన్నారని తెలిసింది. తనకు అనేక వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని మోదీకి బైడెన్ తెలియజేశారట. తానెప్పుడూ కలవని.. పరిచయం లేని వారు సైతం ఫోన్లు చేసి మోదీతో కలిసే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారని సమాచారం.
అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ పపువా న్యూగినియాకు పయనం..
జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన జీ7 సమావేశాన్ని ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పపువా న్యూగినియాకు బయలుదేరారు. అక్కడ మే 22న జరిగే 'ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్' సమ్మిట్‌లో ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపేతో కలిసి ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తరువాత ఆస్ట్రేలియాకు వెళ్లి.. మే 22 నుంచి 24 వరకు అక్కడే ఉంటారు. ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. దాంతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన వివిధ సంస్థల సీఈఓలతో, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. అదే విధంగా సిడ్నీలో భారతీయులతో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు.
పపువా న్యూగినియాకు బయలుదేరిన మోదీ