ఫ్రాన్స్ బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని మోదీ.. పరేడ్‌లో 269 మంది భారత సైనికులు PM Modi France Visit : ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన బాస్టిల్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి మోదీ పరేడ్‌ను వీక్షించారు. ఐరోపాలోనే అతిపెద్ద కవాతుగా పేరున్న బాస్టిల్ డే పరేడ్‌లో భారత సైనికులు పాల్గొన్నారు. భారత సాయుధ దళాలకు చెందిన 269 మంది.. ఫ్రాన్స్ దళాలతో కలిసి పరేడ్ చేశారు. భారత్‌కు చెందిన 4 రఫేల్ విమానాలు, 2 సీ-17 గ్లోబ్‌మాస్టర్లు పారిస్ గగనతలంలో విన్యాసాలు నిర్వహించాయి.
'భారత్- ఫ్రాన్స్ బంధం చాలా గొప్పది. భారత్‌కు ఫ్రాన్స్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామిగా ఉన్నందుకు 140 కోట్ల మంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు' అని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌కు హాజరవ్వడంపై ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ స్పందించారు. 'ప్రపంచ దిగ్గజం, భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న దేశం, వ్యూహాత్మక భాగస్వామి, ఫ్రాన్స్‌కు మిత్ర దేశానికి చెందిన వ్యక్తి.. బాస్టిల్ డే పరేడ్‌కు ముఖ్య రావడం ఆనందంగా ఉంది.' అని హిందీలో ట్వీట్ చేశారు.
France Bastille Day Parade : బాస్టిల్ పరేడ్ అనంతరం.. మేక్రాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలు, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, ఇండో-పసిఫిక్ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది.
రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ గురువారం పారిస్ చేరుకున్నారు. అదే రోజు రాత్రి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. ఈ సందర్భంగా మేక్రాన్.. ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్' అవార్డుతో సత్కరించారు.
అంతకుముందు.. భారత్‌లో అత్యంత విజయవంతమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ UPIను.. ఇక ఫ్రాన్స్‌లో ఉపయోగించుకోవచ్చని మోదీ ప్రకటించారు. భారత్- ఫ్రాన్స్ UPIని ఉపయోగించడానికి అంగీకరించాయని ఆయన తెలిపారు. త్వరలో ఈఫిల్ టవర్ నుంచి ఫ్రాన్స్‌లో యూపీఐ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఫ్రాన్స్‌లో పర్యటించే భారతీయ పర్యటకులు ఇక రూపాయాల్లోనూ డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చంటూ మోదీ ప్రకటించారు. నగదు రహిత తక్షణ చెల్లింపులో ఇదీ భారీ ఆవిష్కరణగా పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత బలం, పాత్ర పెరుగుతోందన్న ప్రధాని.. జీ20కి అధ్యక్షత వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తొమ్మిదేళ్లలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి ప్రజలే అనుసంధానకర్తలన్న ప్రధాని.. ప్రవాసీయులు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రపంచ ఆర్థిక నిపుణులు భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.