PM Modi Netanyahu Israel Hamas War :ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి అతి త్వరగా శాంతియుత మార్గంలో ముగింపు పలకాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బందీలను దౌత్యపరమైన చర్చల ద్వారా విడిపించుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. గాజా ప్రజలకు మరింతగా మానవతా సాయం అందాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి మంగళవారం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు జరిగాయి. ఇటీవల జరిగిన పరిణామాల గురించి నెతన్యాహు మోదీకి వివరించారు. చర్చలు ఫలప్రదంగా సాగాయని ఆ తర్వాత మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు.
అయితే ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌకలపై జరగుతున్న దాడులపట్ల ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బాబ్ ఎల్- మండెప్ ప్రాంతంలో ఆ నౌకలకు రక్షణ కల్పించే చర్యల దిశగా వారి చర్చలు సాగాయి. ఇరాన్ మద్దతుతో హౌతీ రెబల్స్ దాడులు చేయడం గురించి ఇరు దేశాల నేతలు మాట్లాడుకున్నారని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 'ఇరువురు నేతలు సరకు రవాణా నౌకల ప్రయాణం సాఫీగా సాగాల్సిన అవసరాన్ని గురించి చర్చించారు. హౌతీ దాడుల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే ఇబ్బందులపై చర్చలు జరిపారు. ఇండియా, ఇజ్రాయెల్ ఆర్థిక సంబంధాలపై పడే ప్రభావం గురించి కూడా మాట్లాడారు' అని ప్రధాని కార్యాలయం వివరించింది. ఇజ్రాయెల్‌కు అత్యవసరంగా కావాల్సిన కార్మికుల అంశం ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చింది. ఇలాగే పలు అంశాలపై తరచూ మాట్లాడుకుందామని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు.