Modi Lumbini visit: భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని అన్నారు. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి ఒకే కుటుంబంగా మారుస్తోందని పేర్కొన్నారు. "బుద్ధుడు జన్మించిన నేలపై ఉన్న శక్తి ఉత్తేజకరంగా ఉంది. ఇది విభిన్న అనుభూతిని ఇస్తోంది" అని అన్నారు. 2014లో లుంబినిలో నాటేందుకు తాను పంపించిన మహాబోధి మొక్క.. ఇప్పుడు చెట్టుగా మారిందని మోదీ పేర్కొన్నారు.
"బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడు. బుద్ధుడు అందరివాడు. రాముడికి సైతం నేపాల్‌తో బంధం ఉంది. నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం. బుద్ధుడే మనల్ని కలుపుతున్నాడు. ఒకే కుటుంబంగా మార్చుతున్నాడు. ఈ నేపథ్యంలో.. ఇరుదేశాల సంబంధాలను నేపాల్‌లోని ఎత్తైన పర్వతాల స్థాయికి చేర్చాలి. పండగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు.. ఇలా ఇరుదేశాల మధ్య వేల సంవత్సరాలుగా బంధం కొనసాగుతోంది. వీటిని మనం శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలకు విస్తరించాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
Modi in Nepal Lumbini: ఒకరోజు పర్యటనలో భాగంగా సోమవారం నేపాల్ పర్యటనకు వెళ్లారు మోదీ. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవీ ఆలయాన్ని సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను మోదీకి వివరించారు నిర్వాహకులు. అనంతరం మోదీ గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు.