PM Modi Gets Highest Civilian Award :ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. గ్రీస్ పర్యటనలో ఉన్న ఆయనకు ఏథెన్స్‌లో 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్'ను ప్రదానం చేశారు ఆ దేశ అధ్యక్షురాలు సకెల్లారోపౌలౌ. అనంతరం ఆమెతో సమావేశమైన ప్రధాని మోదీ.. చంద్రయాన్ 3 విజయంపై మాట్లాడారు. ఇది కేవలం భారత్ విజయం మాత్రమే కాదని.. యావత్ మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. చంద్రయాన్ 3 సేకరించిన డేటా యావత్ మానవాళితో పాటు శాస్త్ర సాంకేతిక రంగానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.
నీతిమంతులను మాత్రమే గౌరవించాలనే ఎథీనా అనే దేవత సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. 1975లో గ్రీస్ ప్రభుత్వం 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్' పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించింది. గ్రీస్ అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. గ్రీక్-భారత్ స్నేహ బంధం బలోపేతానికి కృషి చేసిన మోదీకి ఆ దేశం ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
గ్రీక్ ప్రధానితో మోదీ చర్చలు
భారత్-గ్రీస్ మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్రీస్‌లో పర్యటిస్తున్న మోదీ.. ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు వేర్వేరు రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ అంశాలపై ఇరుదేశాలు పరస్పరం సహకరించుకునే విషయమై చర్చలు జరిపినట్లు ప్రధాని తెలిపారు. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా పెరుగుతోందని, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 2030 నాటికి భారత్-గ్రీస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
"భారత్-గ్రీస్ మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. విశ్వంలోని రెండు పురాతన నాగరికతలే కాకుండా.. విశ్వంలోని రెండు పురాతన ప్రజాస్వామ్య ఆలోచనలు. పురాతన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంత పురాతనమైనవో అంతే దృఢమైనవి కూడా. విజ్ఞాన్, కళా, సంస్కృతి విషయాల్లో ఒకరి నుంచి మరొకరం నేర్చుకున్నాం. భారత్-గ్రీస్ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మకస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. రక్షణ, భద్రత, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, విద్య నూతనంగా ఆవిర్భవించిన సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారం పెంచుకొని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాం."