PM Modi France Visit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న.. ఆయనను ఆ దేశ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియాన్ ఆఫ్ హానర్‌ను ఇచ్చి గౌరవించింది. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్.. ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని.. ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన.. ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. భారీగా తరలివచ్చిన ప్రవాసీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. భారత వేగవంతమైన అభివృద్ధిని వారికి వివరించారు.
భారత్‌లో అత్యంత విజయవంతమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ UPIను.. ఇక ఫ్రాన్స్‌లో ఉపయోగించుకోవచ్చని మోదీ ప్రకటించారు. భారత్- ఫ్రాన్స్ UPIని ఉపయోగించడానికి అంగీకరించాయని ఆయన తెలిపారు. త్వరలో ఈఫిల్ టవర్ నుంచి ఫ్రాన్స్‌లో యూపీఐ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఫ్రాన్స్‌లో పర్యటించే భారతీయ పర్యటకులు ఇక రూపాయాల్లోనూ డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చంటూ మోదీ ప్రకటించారు. నగదు రహిత తక్షణ చెల్లింపులో ఇదీ భారీ ఆవిష్కరణగా పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత బలం, పాత్ర పెరుగుతోందన్న ప్రధాని.. జీ20కి అధ్యక్షత వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తొమ్మిదేళ్లలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి ప్రజలే అనుసంధానకర్తలన్న ప్రధాని.. ప్రవాసీయులు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రపంచ ఆర్థిక నిపుణులు భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
"రానున్న 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ కృషి చేస్తోంది. ఇందులో మీ (ప్రవాస భారతీయులు) పాత్ర చాలా కీలకం. భారత్ అభివృద్ధి చెందుతోందని, ఒక ప్రకాశవంతమైన ప్రదేశమని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. పెట్టుబడులకు భారత్‌లో విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. మీరు భారత్‌లో పెట్టుబడులు పెట్టండి. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు సౌకర్యాలు కల్పించేందుకు, వారిని రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉక్రెయిన్ అయినా.. సుడాన్ అయినా.. యెమెన్ అయినా అఫ్గానిస్ధాన్ అయినా ఇరాక్ అయినా.. నేపాల్ అయినా భారతీయులను రక్షించడానికి మేము ఎల్లప్పుడూ ముందుకు వస్తాం. భారత్‌లో ఉన్న పౌరులు మాకు ఎంత ముఖ్యమో, విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు మాకు అంతే ముఖ్యం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి