Pilot Arrested For Being Drunk : పారిస్ నుంచి వాషింగ్టన్ బయలుదేరేందుకు ఓ విమానం సిద్ధంగా ఉంది. అప్పటికే అందులో 267 మంది ప్రయాణికులు ఎక్కి.. తమ సీట్లో కూర్చొన్నారు. అంతా అప్రమత్తమై.. టేకాఫ్ ఎప్పుడు అవుతుందా అని వేచిచూస్తున్నారు. అదే సమయంలో ఆ విమాన పైలట్‌ను ఎయిర్‌పోర్టు పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. దీంతో మరికొన్ని క్షణాల్లో టేకాఫ్ అవ్వాల్సి ఉండగా.. విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే?
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పారిస్ నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా.. పైలట్ కూడా విమానం ఎక్కేందుకు బయలుదేరాడు. ఆ సమయంలో ఆయన తీరుపై భద్రతాధికారులకు అనుమానం వచ్చింది. పైలట్ కళ్లు ఎర్రగా మారినట్లు గుర్తించారు. అంతే కాకుండా అతడు తూలుతున్నట్లు కనిపించడం వల్ల మద్యం సేవించి ఉన్నట్లు అనుమానించారు.
వెంటనే ఆల్కహల్ టెస్టు నిర్వహించగా.. నిబంధనల కంటే ఆరురెట్లు మద్యం స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పైలట్‌ను అరెస్టు చేశారు. చేసేదేమి లేక చివరి క్షణంలో విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అయితే పైలట్‌ను విచారించగా ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. అంతకుముందు రాత్రి తాను రెండు గ్లాసుల మద్యం మాత్రమే సేవించినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత న్యాయస్థానం ముందు ఇదే విషయాన్ని అంగీకరించాడు.
ఒకవేళ అదే పరిస్థితిలో విమానం నడిపితే 267 మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉండేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో పైలట్‌కు ఆరునెలల జైలుశిక్షతోపాటు ఐదు వేల డాలర్ల జరిమానా విధించారు. ఈ ఘటనపై సదరు ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఇటువంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. ఆ పైలట్‌ను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి అధికారుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్టు ప్రకటించింది.
మంచి నిద్రలో పైలట్లు 37 వేల అడుగుల ఎత్తులో విమానం చక్కర్లు..
విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అందులోని ఇద్దరు పైలట్లూ ఆదమరిచి నిద్రపోయారు. గతేడాది ఆగస్టులో ఈ ఘటన జరిగింది. ఈఏకు చెందిన బోయింగ్ 737 విమానం సూడాన్ నుంచి ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాకు ప్రయాణమైంది. కొద్దిసేపటి తర్వాత పైలట్లు లోహవిహంగాన్ని ఆటోపైలట్ మోడ్‌లో ఉంచారు. ఆపై వారిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.