Philippines Earthquake Today 2023 :ఫిలిప్పీన్స్‌లోని మిందానో ద్వీపకల్పాన్ని భారీ భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. సముద్ర మట్టానికి 32 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూరోపియన్ మెడిటేరియన్ సెస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకటించింది. శనివారం రాత్రి 8.07 గంటల సమయంలో ఈ భారీ భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
సునామీ హెచ్చరికలు జారీ
Philippines Tsunami Warning :ఈ పరిస్థితుల నేపథ్యంలో సునామీ సంభవించే అవకాశముందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ హెచ్చరించింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. సుర్జియో డెల్ సుర్, డావావో ఓరియంటల్ ప్రావిన్స్ల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని.. పడవలను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు సముద్రం లోపలికి వెళ్లొద్దని తెలిపింది.
గత నెలలోనే భారీ భూకంపం
Philippines Earthquake News :అంతకుముందు గత నెలలోనే దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ కొటబాటో, సారంగని, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సెస్ తదితర దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. భూకంప ప్రభావం వల్ల పలుచోట్ల రోడ్లు కుంగిపోయాయి. కొన్ని భవనాలు కుప్పకూలిపోగా.. మరికొన్ని చోట్ల గోడలు బీటలు వారాయి.