ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 30 మంది దుర్మరణం చెందారు. రైజాల్ ప్రావిన్స్‌లో ఓ ప్రయాణికుల పడవ బోల్తా పడటం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరో 40 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. తుపాను గాలులకు పడవ ఊగిపోయిందని, ఈ క్రమంలో భయపడిన ప్రయాణికులు.. పడవలో ఒకవైపునకు రావడం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉందని చెప్పారు.
ప్రమాదానికి గురైన పడవ ఫిలిప్పీన్స్‌లోని అతిపెద్ద సరస్సు అయిన లాగునాలో ప్రయాణిస్తోంది. గురువారం బినన్‌గొనన్ నుంచి తాలిమ్ ద్వీపానికి ఈ పడవ బయలుదేరింది. అయితే, ఫిలిప్పీన్స్ తీరంలో ఇప్పటికే డోక్సురి అనే టైపున్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఫలితంగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ గాలులకు లాగునాలో ప్రయాణిస్తున్న పడవ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. సరస్సులోని పడవ అటూఇటూ ఊగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అంతా ఒకేవైపు వచ్చేయడం వల్ల పడవ బ్యాలెన్స్ తప్పింది. చివరకు బోల్తా పడింది. చివరకు పడవ నీటిలో మునిగిపోయవడం వల్ల 30 మంది చనిపోయారు. పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయక చర్యల నిమిత్తం రంగంలోకి దిగి 40 మందిని కాపాడారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. టైఫున్ విధ్వంసానికి ఫిలిప్పీన్స్‌లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులు అయ్యారని అధికారులు వెల్లడించారు.