తెలంగాణ

telangana

ETV Bharat / international

IMF మెప్పు కోసం 'పాక్​' పాకులాట.. లీటర్​ పెట్రోల్​ రూ.272కు పెంపు.. - పాకిస్థాన్ లేటెస్ట్ న్యూస్

ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్‌ ప్రజలకు చుక్కలు చూపెడుతోంది. అవినీతి కాటు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో.. పాక్‌ పాలకులు, ప్రజలకు తెలిసివస్తోంది. ఇప్పటికే నిత్యావసరాలు తారస్థాయికి చేరిన పాకిస్థాన్‌లో ప్రభుత్వం మరోసారి పెట్రోల్‌, డీజిల్ ధరలను భారీగా పెంచేసింది. తద్వారా ఐఎంఎఫ్​ను మెప్పించి రుణం పొందేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది.

petrol price hike in pakistan
పాకిస్థాన్​లో పెట్రోల్ ధరలు

By

Published : Feb 16, 2023, 12:14 PM IST

పాకిస్థాన్ చరిత్రలోనే ఇంధన ధరలను అక్కడి ప్రభుత్వం భారీ స్థాయిలో పెంచేసింది. ఇటీవలే ఒకసారి భారీగా పెట్రోల్​ ధరలు వడ్డించిన పాక్‌ సర్కార్‌ భారీ రుణం కోసం ఐఎంఫ్​ను సంతృప్తి పరిచేందుకు ప్రజలపై మరోసారి పెట్రో ధరల బాంబు జారవిడిచింది. ప్రజల నుంచి పన్నుల రూపేణ మరో 170 బిలియన్లు వసూలు చేసేందుకు పార్లమెంటులో మినీ బడ్జెట్ ప్రవేశపెట్టిన గంటల్లోనే పాకిస్థాన్‌లో పెట్రో ధరలు ఆకాశాన్నంటాయి. బుధవారం అర్ధరాత్రి తర్వాత అమల్లోకి వచ్చిన నూతన ధరల ప్రకారం పెట్రోల్ లీటరుకు రూ.22 పెంచింది. ఈ పెంపుతో పాకిస్థాన్‌లో లీటరు పెట్రోల్‌ రూ.272కు చేరింది. హైస్పీడ్ డీజిల్‌పై రూ.17.20 పెంచడం వల్ల దాని ధర లీటరు రూ.280కు ఎగబాకింది.

లైట్ డీజిల్‌పై రూ. 9.68 పైసలు పెంచడం వల్ల దాని ధర రూ.196.68 పైసలకు చేరింది. కిరోసిన్‌పై రూ.12.90 పైసలు వడ్డించడం వల్ల లీటరు కిరోసిన్ రూ.202. 73కు చేరింది. పాకిస్థాన్‌ రూపాయి విలువ తగ్గడం వల్ల దానికి అనుగుణంగానే ఇంధన ధరలను సవరించినట్లు పాకిస్థాన్‌ ఆర్థికశాఖ ప్రకటించింది.

7 బిలియన్ డాలర్ల రుణంలో 1.1 బిలియన్ డాలర్లు విడుదల చేయాలంటే ముందు రెవిన్యూను పెంచుకోవాలని ఐఎంఎఫ్​ షరతు విధించింది. ఈ నేపథ్యంలో పన్నులు పెంచుతూ మినీ బడ్జెట్‌ను పాక్‌ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పెట్రోల ధరల పెంపు కూడా ఐఎంఎఫ్​షరతుల్లో ఒక భాగమే. ఇప్పటికే నిత్యావసరాల అధిక ధరలతో పాక్‌లోని పేద, మధ్యతరగతి ప్రజలు ఒక పూట తినడమే గనగమైపోతోంది. ఈ పరిస్థితుల్లో పెట్రో ధరల భారం మరింత ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోయనుంది. ప్రస్తుతం ద్విచక్రవాహనాలు, కార్లకు,సీఎన్​జీకి ప్రత్యామ్నాయంగా పెట్రోల్‌ మాత్రమే వాడాల్సి వస్తోంది. సీఎన్​జీ స్టేషన్‌లలో గ్యాస్‌ లేకపోవడమే ఇందుకు కారణం. పాకిస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ బదులు ఇప్పుడు కిరోసిన్‌ మాత్రమే ఉపయోగిస్తున్నారు. పాకిస్థాన్ సైన్యం కూడా ఇంధనం లభ్యత విషయంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

గత వేసవిలో భారీ వరదలను చవిచూసిన పాకిస్థాన్‌ ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్రవాద దాడులతో అల్లాడిపోతోంది. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్​తో పది రోజులు రుణం కోసం చర్చలు జరిగినా ఒప్పందం కుదరలేదు. ముందుస్తుగా కొన్ని చర్యలు తీసుకుంటేనే రుణంలో మొదటి విడత నిధులు విడుదల చేస్తామని ఐఎంఎఫ్​ అనేక షరతులు పెట్టింది. ఐఎంఎఫ్​ విధించిన షరతులను ఒక్కోటిగా అమలు చేస్తున్న పాకిస్థాన్‌ సొంత ప్రజల నడ్డి విరుస్తోంది. రుణ ఒప్పందం ఖరారుకు పాకిస్థాన్‌ అధికారులు, ఐఎంఎఫ్​ ప్రతినిధుల మధ్య ఆన్‌లైన్‌లో చర్చలు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details