తెలంగాణ

telangana

ETV Bharat / international

కీవ్‌ ముంగిట భయానక శీతాకాలం.. రష్యా దాడులతో నీరు, విద్యుత్తుకు కటకట - ukraine russia conflict

ఉక్రెయిన్​లోని విద్యుత్​ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి.. గత నెలంతా రష్యా ప్రత్యేక దృష్టి పెట్టింది. దాని ఫలితంగా.. కీవ్​ ప్రజలు ఎముకులు కొరికే చలిలోనూ చీకట్లో ఉండిపోయారు. మరి కొద్ది రోజులు ఇలానే దాడులు కొనసాగితే ఉక్రెయిన్​ వాసులకు ఈ శీతాకాలం ఓ పీడకలలా మారనుంది.

ukraine power cuts
కీవ్‌ ముంగిట భయానక శీతాకాలం

By

Published : Nov 7, 2022, 6:58 AM IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇలాగే కొనసాగితే.. రాజధాని నగరం కీవ్‌కు ఈ శీతాకాలం ఓ పీడకలలా మారనుంది. ఉక్రెయిన్‌ వనరులపై మాస్కో జరుపుతున్న దాడులతో నీటికి, విద్యుత్తుకు జనం మరింత కటకటపడే దుస్థితి ఎదురుకానుంది. ఎముకలు కొరికే చలిలో హీటర్లు పనిచేయక నరకయాతన తప్పేలా లేదు. 'ఈ పరిస్థితులు నివారించేందుకు మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. శత్రువులు మరింత పట్టు బిగిస్తున్నారు. ఈ దుస్థితిని మేమెలా తట్టుకొని నిలబడగలమనే దానిపై ఉక్రెయిన్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది' అని కీవ్‌ మేయర్‌ విటాలి క్లిట్స్‌చ్కో మీడియాకు తెలిపారు.

గత నెలంతా ఉక్రెయిన్‌ విద్యుత్తు మౌలిక సదుపాయాల ధ్వంసంపై రష్యా దృష్టి పెట్టింది. ఫలితంగా దేశమంతా విద్యుత్తుకోతలు, అంతరాయాలు పెరిగాయి. కీవ్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదివారం రొటేషన్‌ పద్ధతిలో విద్యుత్తు సరఫరా ఇవ్వడంతో పలు జనావాసాలు చీకట్లో ఉండిపోయాయి. 30 లక్షల జనాభా ఉన్న కీవ్‌లో వెయ్యి తాప కేంద్రాలను (హీటింగ్‌ పాయింట్లు) ఏర్పాటు చేయాలని అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో చిన్న ఆశాకిరణం లాంటి వార్త ఆదివారం స్థానిక పత్రికల్లో వచ్చింది. జపోరిజియా అణు విద్యుత్కేంద్రం మళ్లీ ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌తో అనుసంధానమైంది.

ఇటు రష్యా ఆక్రమణలో ఉన్న ఖేర్సన్‌ నగర పౌరుల ఫోన్లకు హెచ్చరికలతో కూడిన సందేశాలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌ సైన్యం భీకర దాడులకు ప్రయత్నించే అవకాశం ఉన్నందున, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలాలని రష్యన్‌ సైనికులు హెచ్చరిస్తున్నారు. తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా దళాలు తమ దాడులను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పవర్‌ ప్లాంట్లు అన్నీ ధ్వంసం కావడంతో స్థానికుల పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. శనివారం రాత్రి నాలుగు క్షిపణులను ప్రయోగించిన రష్యా 19 మార్లు వైమానిక దాడులకు పాల్పడింది. ఖర్కీవ్‌ నుంచి రష్యా దళాలు వైదొలిగాక, పెద్దసంఖ్యలో ఉన్న మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇజియం నగరంలోని ఓ సామూహిక ఖనన ప్రాంతం నుంచి 450 మృతదేహాల డీఎన్‌ఏ నమూనాలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details