Israeli police Palestinians clash: జెరూసలేంలోని ప్రముఖ ప్రార్థన మందిరం అల్-అక్సా మసీదు వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. పవిత్ర రంజాన్ మాసం కావడం వల్ల పెద్ద ఎత్తున ముస్లింలు ప్రార్థన చేసేందుకు అల్ అక్సా మసీదుకు వచ్చారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బలగాలు మసీదులోకి ప్రవేశించేందుకు యత్నించడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తాయి.
Israeli police clash: బలగాలను అడ్డుకునేందుకు వేలాది మంది పాలస్తీనియన్లు మసీదుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున బలగాలపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను పోలీసులు నిలువరించే క్రమంలో పలువురు గాయపడ్డారు. దాడికి సేకరించిన రాళ్లను స్వాధీనం చేసుకునేందుకే తమ బలగాలు మసీదు లోపలికి ప్రవేశించాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. హింసను ముందే ఊహించి వారు వాటిని సేకరించినట్లు ఆరోపించింది. పరిస్థితిని శాంత పరిచేందుకు తాము కృషి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ పేర్కొన్నారు.