Palestine President Hamas :ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడులపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ స్పందించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవని స్పష్టం చేశారు. హమాస్ చేసే దురాగతాలతో పాలస్తీనా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కేవలం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్(అధికార పార్టీ) విధివిధానాలే దేశాన్ని ప్రతిబింబిస్తాయని వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్, హమాస్ పరస్పర దాడుల్ని, అమాయక ప్రజల ప్రాణాలు తీయడాన్ని ఖండించారు. ఇరు వర్గాలు బందీలుగా ఉన్న పౌరులు, ఖైదీలను విడుదల చేయాలని అబ్బాస్ కోరారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల్ని అనేక దేశాలు ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు అక్కడి ప్రజలను అతి క్రూరంగా చంపేశారు.
అంతకుముందు.. ఈ విషయంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించాలని.. హమాస్ పాలస్తీనీయన్లకు ప్రతినిధి కాదని పునరద్ఘాటించాలని కోరినట్లు తెలిపారు. ఘర్షణ విస్తరించకుండా.. గాజా ప్రజలకు మానవతా సామాగ్రి అందించేలా ఆ ప్రాంతంలోని భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్లు బైడెన్ వెల్లడించారు.
పౌరులు.. పిల్లలు మూల్యం చెల్లించుకుంటున్నారు: టెడ్రోస్ అథనామ్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ దాడులు అతి క్రూరమైనవి అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడుల్ని ఖండించాల్సిందేని చెప్పారు. బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని హమాస్ వెంటనే విడిచిపెట్టాలని కోరారు. అలాగే, ఇజ్రాయెల్ దాడుల వల్ల అమాయక పాలస్తీనా ప్రజలు, చిన్నారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని.. లక్షల మంది ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో విధ్వంసం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్న టెడ్రోస్.. ఉత్తర గాజా నుంచి లక్షలమంది దక్షిణ గాజాకి తరలివెళ్తున్నారని, ఈ క్రమంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. గాజాలో వెంటనే విద్యుత్, నీటి సరఫరాలను పునరుద్ధరించాలని.. ప్రజలకు ఆహారం, మందులు పంపిణీ చేసేందుకు అనుమతించాలని టెడ్రోస్ కోరారు.