Imran Khan news: ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టులో వాదోపవాదనలు వాడీవేడిగా సాగాయి. జాతీయ అసెంబ్లీ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష నేతలు న్యాయస్థానానికి తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగేలా ఆదేశాలివ్వాలని, జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును గురువారం రాత్రి 7.30 గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
ఏం జరిగిందంటే..: ఇమ్రాన్ ఖాన్‌పై సొంత పార్టీ నేతల తిరుగుబాటులో మార్చి చివరి వారంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు. అయితే తీర్మానం తిరస్కరణకు గురైంది. అనంతరం ప్రసంగించిన ఇమ్రాన్.. సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని అన్నారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇమ్రాన్ సిఫార్సు మేరకు.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో.. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ అప్పుడే ప్రకటించారు.
ఇమ్రాన్‌పై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. 342 మంది సభ్యుల అసెంబ్లీలో తీర్మానం నెగ్గాలంటే 172 మంది ఓట్లు అవసరం. కాగా, తమకు 177 మంది సభ్యుల బలం ఉందని విపక్షాలు ప్రకటించుకున్నాయి. వంద మందికి పైగా విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానానిపై సంతకం చేశారు. అయితే, పాకిస్థాన్ పార్లమెంట్(నేషనల్ అసెంబ్లీ) డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూర్ విపక్షాల తీర్మానాన్ని తిరస్కరించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. సభను వాయిదా వేశారు.
అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ఇమ్రాన్ ఖాన్. తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. 'నాకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. పాకిస్థాన్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు. అవిశ్వాస తీర్మానం పాకిస్థాన్‌పై జరిగిన విదేశీ కుట్ర. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ(ఆ దేశ పార్లమెంట్)ని రద్దు చేయాలని అధ్యక్షుడికి లేఖ రాశా. తమను ఎవరు పరిపాలించాలో పాకిస్థాన్ ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి' అని ఇమ్రాన్ పేర్కొన్నారు. మరోవైపు, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతించకుండా ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు. విపక్ష పార్టీలు పార్లమెంట్‌ను వీడేది లేదని అన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు చెప్పారు. తమ న్యాయవాదులు అత్యున్నత ధర్మాసనానికి వెళ్తున్నారని తెలిపారు.