తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్ ప్రధానిగా షెహబాజ్ ప్రమాణం.. మోదీ శుభాకాంక్షలు

Pakisthan New PM: పాకిస్థాన్​లో రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. విపక్షాల మద్దతుతో పాక్‌ నూతన ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్‌ చేయడం వల్ల షెహబాజ్‌ ఎన్నిక లాంఛనమైంది. కాగా, పాకిస్థాన్​ నూతన ప్రధానికి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్‌ ఎల్లప్పటికీ శాంతి, స్థిరత్వాన్ని కొరుకుంటుందని పేర్కొన్నారు.

pak cm oath
pak cm oath

By

Published : Apr 12, 2022, 4:51 AM IST

Updated : Apr 12, 2022, 5:06 AM IST

Pakisthan New PM: పాకిస్థాన్‌ నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్‌(ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ (70) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అనారోగ్యం కారణంగా అధ్యక్షుడు డా.ఆరిఫ్​ అల్వీ సభకు గైర్హాజరవ్వడం వల్ల షెహబాజ్‌తో సెనేట్ ఛైర్మన్ సాదిక్ సంజరానీ ప్రమాణం చేయించారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షెహబాజ్‌కు పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. మరోవైపు పీటీఐ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న షా మెహమ్ముద్‌ ఖురేషీ ఈ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ప్రధానమంత్రిగా షెహబాజ్‌కు మార్గం సుగమమైంది.

పాకిస్థాన్‌ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు అక్కడి జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ఇందుకు ఇతర పార్టీల సభ్యులందరూ హాజరైనప్పటికీ ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ సభ్యులు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పీటీఐ పార్టీ నేతలంతా మూకుమ్మడి రాజీనామా చేసి, ప్రధాని ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దొంగలతో కలిసి జాతీయ అసెంబ్లీలో కూర్చోలేమంటూ పీటీఐ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉంటే, మనీ లాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షెహబాజ్‌ షరీఫ్‌తోపాటు ఆయన కుమారుడికి పాకిస్థాన్‌ న్యాయస్థానంలో ఊరట లభించింది. న్యాయస్థానానికి హాజరుతోపాటు అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ను పొడగించిన న్యాయస్థానం.. ఈ కేసును ఏప్రిల్‌ 27కు వాయిదా వేసింది. దీంతో పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌కు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమయ్యింది.

మోదీ అభినందనలు.. పాకిస్థాన్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన పీఎంఎల్‌(ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌(70)కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. "పాకిస్థాన్‌ ప్రధానిగా ఎన్నికైన మియాన్‌ ముహమ్మద్‌ షెహ్‌బాజ్‌ షరీఫ్‌కు అభినందనలు. ఉగ్రవాదం లేని ప్రాంతంలో భారత్‌ ఎల్లప్పటికీ శాంతి, స్థిరత్వాన్ని కొరుకుంటుంది. తద్వారా మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టిసారించవచ్చు. ఇది మన ప్రజలకు ఎంతో శ్రేయస్కరం" అని మోదీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పాక్​ కొత్త ప్రధానిగా షెహబాజ్- కశ్మీర్​పై కీలక వ్యాఖ్యలు

Last Updated : Apr 12, 2022, 5:06 AM IST

ABOUT THE AUTHOR

...view details