Pakistan Ban China Econamic Corridor: చైనా - పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) అథారిటీని రద్దు చేస్తూ షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళికా మంత్రి అషన్ ఇఖ్బాల్ దీన్ని వనరులను వృథా చేసే 'అనవసరమైన సంస్థగా ఆదేశాల్లో పేర్కొన్నారు. రూ.4.5 లక్షల కోట్ల (60 బిలియన్ డాలర్లు) ఈ ప్రాజెక్టుకు ఇమ్రాన్ సర్కారు 2019లో శ్రీకారం చుట్టింది. బైనాలోని షిన్ జియాంగ్ ప్రావిన్సు నుంచి పాక్‌లోని బలూచిస్టాన్ ప్రావిన్సు పరిధిలో ఉన్న గదర్ ఓడరేవు నడుమ మౌలిక సదుపాయాలు, ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళిక ఇది. ఇప్పటికే దీనిపై దాదాపు సగం వ్యయం చేసినట్లు చైనా చెబుతోంది.
ఇమ్రాన్‌కు పటిష్ట భద్రత: మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు పటిష్ట భద్రత కల్పించాలంటూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖను అదేశించారు. గురువారం రాత్రి లాహోర్‌లో తన మద్దతుదారులతో ఇమ్రాన్ ఏర్పాటుచేసిన ర్యాలీకి భద్రతపరంగా ముప్పు ఉన్నట్లు సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరించాయి. దీంతో వర్చువల్ సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించగా, ఇమ్రాన్ ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ రక్షణకు తక్షణం పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా షెహబాజ్ షరీఫ్ అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం గురువారం ట్విటర్ ద్వారా పేర్కొంది.