Pakistan Vs Iran War :బలూచిస్థాన్‌లో ఇరాన్ చేసిన దాడులకు పాకిస్థాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇరాన్‌లోని వేర్పాటువాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోయారు. ఇరాన్ భూభాగంలో తలదాచుకుంటున్న బలూచిస్థాన్ వేర్పాటువాద క్యాంపులపై తమ దేశ వైమానిక దళం దాడులు చేసినట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్థాన్‌లో వాంటెడ్‌గా ఉన్న మిలిటెంట్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించింది. ఈ నిఘా ఆపరేషన్‌కు 'మార్గ్ బర్ సర్మాచార్' అని నామకరణం చేసినట్లు పాక్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
"ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్న విషయంపై ఆ దేశంతో జరిగిన చర్చల్లో పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. తమను తాము సర్మాచార్లుగా అభివర్ణించుకునే ఆ ఉగ్రవాదుల జాడపై కచ్చితమైన సమాచారాన్ని ఇరాన్‌కు పాక్ అందించింది. కానీ, మా ఆందోళనలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ సర్మాచార్లు అమాయకులైన పాకిస్థాన్ ప్రజలపై దాడి చేసి రక్తపాతం సృష్టించారు. సర్మాచార్లు పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఈ (గురువారం) ఉదయం చర్యలు తీసుకున్నాం. దేశ భద్రతను కాపాడేందుకు ఈ దాడులు నిర్వహించాం."
-పాకిస్థాన్ విదేశాంగ శాఖ
ఏడుగురు మృతి
ఈ దాడుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు చనిపోయారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. 'గురువారం ఉదయం 4.50 గంటలకు సీస్టాన్ బలూచిస్థాన్ రాష్ట్రంలోని సరవన్ నగరం సమీపంలో పేలుళ్ల శబ్దం వినిపించింది. ప్రాథమిక విచారణ తర్వాత ఇవి పాక్ చేసిన దాడులు అని తెలిసింది. సరిహద్దులోని ఓ గ్రామాన్ని లక్ష్యంగా చేసుకొని క్షిపణితో దాడి చేసినట్లు మేం గుర్తించాం' అని ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారి అలీరెజా మర్హామాటి పేర్కొన్నారు.
24 గంటల్లోనే ప్రతీకారం
పాక్‌లోని జైష్ అల్ అదిల్ (ఆర్మీ ఆఫ్ జస్టిస్)కు చెందిన రెండు కీలక స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించిన 24 గంటల్లోనే ఈ మేరకు ప్రతీకార చర్యలు తీసుకుంది. ఇరాన్ దాడులు తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించాయని, ఇందుకు తీవ్ర పరిణామాలు తప్పవని పాక్ బుధవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు పాకిస్థాన్ స్థానిక వార్తాపత్రిక ఎడిటర్, న్యూయార్క్ టైమ్స్ కరస్పాండెంట్ సల్మాన్ మసూద్ వెల్లడించారు. బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలపై దాడులు జరిగాయని చెప్పారు.