Pakistan Train Accident : పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి 1,000 మందికి పైగా ప్రయాణికులతో రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన సుమారు 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్సులోని నవాబ్షా జిల్లా సర్హరి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
Pakistan Train Derailed : పట్టాలు తప్పిన బోగీల నుంచి అనేక మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్థాన్ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ మహమూద్ రెహ్మాన్ ధ్రువీకరించారు. ఇంకా అందులో ఉన్న బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టామని.. దానిపైనే తమ దృష్టంతా ఉందని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సూమారు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని.. బ్రేక్‌లు వేయడం ఆలస్యమవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని పాకిస్థాన్ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. యంత్రాల సహాయంతో బోగీలను పట్టాల నుంచి పక్కకు తీస్తున్నామని చెప్పారు.
Pakistan Train Crash : ఈ ఘటనపై పాకిస్థాన్ ఫెడరల్ రైల్వే, ఏవియేషన్ శాఖ మంత్రి ఖవాజా సాద్ రఫీక్ స్పందించారు. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయినట్లు, గాయపడినట్లు నివేదికలు వచ్చాయని తెలిపారు. అయితే, ఇది మెకానికల్ లోపమా? లేక ఎవరైనా కావాలని చేసిన పనా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. అయితే, మొత్తం ఎన్ని బోగీలు పట్టాలు తప్పాయో ఇంకా స్పష్టంగా తెలియలేదని.. సుక్కుర్ రైల్వే డివిజన్ కమర్షియల్ అధికారి (డీసీఓ) మొహ్సిన్ సియాల్ తెలిపారు. కొందరు ఐదు, మరికొందరు 8, ఇంకొందరు 10 బోగీలు పట్టాలు తప్పినట్లు చెబుతున్నారని అన్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని నవాబ్షా డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.