ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగి పోయేలా బదులిచ్చింది . పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగం అనంతరం భారత్ ప్రత్యుత్తర హక్కును వినియోగించుకుని దాయాది దేశం కుయుక్తులను ఎండగట్టింది. అంతర్జాతీయ వేదికపై తప్పుడు ఆరోపణలు చేయడం పాక్‌కు... సాధారణం అయిపోయిందని ఐరాసలో భారత శాశ్వత బృందం తొలి కార్యదర్శి మిజిటో వినిటో ఎద్దేవా చేశారు. కశ్మీర్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని.. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతుందని విమర్శించారు. దావూద్ ఇబ్రహీం గురించి ప్రస్తావించిన వినిటో... శాంతి కావాలని ఆశిస్తున్న దేశం ఎన్నటికీ 1993 బాంబు పేలుళ్ల నిందితులకు ఆశ్రయాన్ని ఇవ్వదని ఎద్దేవా చేశారు. పాక్‌తో భారత్ స్నేహపూర్వక సంబంధాల్ని కోరుతోందని... ఉగ్రవాదం, ద్వేషం, హింస వద్దని హితవు పలికారు. స్వదేశంలో మైనార్టీలను పట్టించుకోని పాకిస్థాన్.. ప్రపంచ మైనార్టీల రక్షణ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు.
"భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేయడానికి పాకిస్థాన్ ప్రధాని ఈ సభ వేదికను ఎంచుకోవడం విచారకరం. పాక్ ప్రధాని తన దేశంలో నెలకొన్న అకృత్యాలను మరుగున పడేసేందుకు భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తన పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పుకునే దేశం... సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ప్రోత్సహించదు. భయంకరమైన ముంబయి ఉగ్రవాద దాడికి పాల్పడ్డ వారికి ఆశ్రయం కల్పించదు. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని తప్పించుకునేందుకే పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. పాక్ నుంచి సీమాంతర ఉగ్రవాదం ఆగిపోయినప్పుడు, అక్కడి ప్రభుత్వాలు పారదర్శకంగా కృషి చేసినప్పుడే ఉపఖండంలో శాంతి, రక్షణ విజ్ఞప్తులన్నీ సాకారం అవుతాయి. పాక్ ప్రజలు, మైనారిటీలు హింసించబడనప్పుడు మాత్రమే అది జరుగుతుంది."
-మిజిటో వినిటో, కార్యదర్శి, ఐరాసలో భారత శాశ్వత బృందం