తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంకలా మారిన పాక్​​.. పెట్రోల్​ కోసం బారులు తీరిన జనం..!

తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. మరో శ్రీలంకలా మారుతోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోవడం వల్ల చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడి పెట్రోల్‌ బంకులు ఖాళీ అవుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోతోంది. కొద్ది నిల్వలు ఉన్న పెట్రోల్‌ బంకుల ముందు వాహనాలు కిలోమీటర్ల కొద్ది బారులు తీరుతున్నాయి.

pakistan run out of petrol
పాకిస్థాన్​లో సంక్షోభం

By

Published : Feb 10, 2023, 7:58 PM IST

పాకిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. విదేశీ మారక నిల్వలు ఖాళీ కావడం వల్ల చమురు దిగుమతులు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా పంజాబ్‌ ప్రావిన్స్‌లో చాలావరకు పెట్రోల్‌ పంపులు మూతపడినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. నెలరోజులకుపైగా పెట్రోల్‌ పంపులకు సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది. దీంతో జన జీవనం స్తంభించి రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం పడినట్లు తెలిపింది. సరిపడా పెట్రోనిల్వలు అందుబాటులో ఉన్నాయని.. అక్రమ నిల్వలపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ.. కొరత అలాగే ఉన్నట్లు వెల్లడించింది.

మరోవైపు పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్.. చమురు సరఫరా సంస్థలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడం లేదని డీలర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. నిల్వలు ఉన్నా ఎక్కువ ధరకు విక్రయించేందుకు సరఫరాను నిలిపివేశారన్న ఆరోపణలను చమురు సంస్థలు ఖండిస్తున్నాయి. పెట్రోల్‌ పంపులు ఖాళీగా ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లోని వాహనదారులు గ్యాస్‌ వాడాలని సూచిస్తున్నారు.

పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో చిన్నా, పెద్ద పట్టణాల్లో పెట్రోల్‌ పంపులు మూసివేసి ఉన్నాయి. లాహోర్, గుజ్రన్‌వాలా, ఫైసలాబాద్‌ వంటి పెద్ద నగరాలతోపాటు మిగితా ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి నెలకొందని డాన్ పత్రిక వెల్లడించింది. లాహోర్‌లోని 450 పెట్రోల్‌ పంపుల్లో 70 పూర్తిగా ఖాళీ అయ్యాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ నిల్వలు ఉన్న పెట్రోల్‌ పంపుల్లో వాహనదారులు బారులు తీరారు. కిలోమీటర్ల మేర కార్లు, ద్విచక్రవాహనాలు.. డీజిల్, పెట్రోల్ కోసం గంటల తరబడి వేచిచూస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్‌ రూపాయి మారక విలువ రికార్డుస్థాయి కనిష్ఠానికి పడిపోవడం వల్ల తాము పతనం అంచున ఉన్నామని పాకిస్తాన్‌ చమురు సంస్థల ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించాయి. మరోవైపు విద్యుత్‌ కోతలు, భారీగా పెరిగిన ధరలతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిల్లో పాక్‌ ప్రజలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details