తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇమ్రాన్​ క్లీన్​బౌల్డ్​.. పాకిస్థాన్​లో కుప్పకూలిన సర్కార్​

ఇమ్రాన్​ ఖాన్​
ఇమ్రాన్​ ఖాన్​

By

Published : Apr 10, 2022, 1:40 AM IST

Updated : Apr 10, 2022, 7:24 AM IST

01:34 April 10

ఇమ్రాన్​ ఖాన్​ క్లీన్​బౌల్డ్​

Imran Khan News: రాజకీయ అస్థిరతకు మారుపేరైన పాకిస్థాన్‌లో గత నెల రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీ చ్యుతుడయ్యారు. శనివారం అనేక వాయిదాల మధ్య సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీ.. అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్‌ను సాగనంపింది. పాకిస్థాన్‌ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ నిలిచారు. ఆదివారం తెల్లవారుఝామున జరిగిన ఓటింగ్‌లో విపక్షాలు ఇమ్రాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. పాక్‌ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉండగా, మెజార్టీకి అవసరమైన బలం 172. అయితే ఇమ్రాన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ ఆయాజ్‌ సాదిఖ్‌ ప్రకటించారు.

అనేక నాటకీయ పరిణామాలు.. ఇమ్రాన్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా శనివారం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్‌ 3న పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ సమావేశం జరిగినా డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం పదిన్నర గంటలకు మరోసారి భేటీ అయ్యింది. శనివారం ఉదయం మొదటి సారి భేటీ అయిన సభ మధ్యాహ్నం 12.30 వరకు వాయిదా పడింది. అనంతరం 3 గంటల వరకు ఒకసారి, రాత్రి 8గంటల వరకు మరోసారి వాయిదా పడింది. ఆ తర్వాత సమావేశమైనా మరో రెండు సార్లు వాయిదా పడి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగే సమయంలో ఇమ్రాన్ సభలో లేరు. ఓటింగ్‌ సమయంలో ఇమ్రాన్‌ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేయగా, ఆయనపై తిరుగుబాటు జెండా ఎత్తిన సొంత పార్టీ సభ్యులు మాత్రం ప్రభుత్వ స్థానంలోనే ఆసీనులయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో పదవి కోల్పోవడం ఖాయం కావడం వల్ల ఇమ్రాన్‌ దానికి ముందే తన అధికారిక నివాసం ఖాళీ చేసి వెళ్లిపోయారు.

నరాలు తెగే ఉత్కంఠ.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా పాకిస్థాన్‌లో శనివారం నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. పదవిని కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడుతానని ప్రకటించిన ఇమ్రాన్‌ అందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఓటింగ్‌ను వ్యూహాత్మకంగా వాయిదా వేస్తూ వచ్చిన ఇమ్రాన్‌.. శనివారం రాత్రి కీలక మంత్రివర్గ భేటీ నిర్వహించారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా, ఐఎస్​ఐ అధినేత ఆయనతో భేటీ అయ్యారు. ఆ తర్వాత పాక్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరీ రాజీనామా చేశారు. అనంతరం ప్యానెల్‌ ఛైర్మన్‌ ఆయాజ్‌ సిద్దిఖ్‌ స్పీకర్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయనే ఓటింగ్‌ను నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పాక్‌ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాసంపై ఓటింగ్‌ నిర్వహించగా, ఒకవేళ అది జరగకపోతే కేసును మళ్లీ విచారించేందుకు వీలుగా సుప్రీంకోర్టును అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినట్లు సమాచారం. ఇమ్రాన్‌ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో తదుపరి ప్రధానిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ పార్టీ అభ్యర్ధి షెహబాజ్‌ షరీఫ్‌ తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు పాక్‌ జాతీయ అసెంబ్లీ ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు భేటీ కానుంది.

ఒక్కరూ ఐదేళ్లు పాలించలేదు:రాజకీయ సంక్షోభాలకు మారుపేరైన పాకిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాల మనుగడ గాలిలో దీపం వంటిదేనని తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేశాయి. సైన్యం కరుణా కటాక్షాలు కొనసాగినంత వరకే ఏ ప్రధాన మంత్రి అయినా పదవిలో మనగలరు. స్వాతంత్య్రం సిద్ధించిన గత 75 ఏళ్లలో ఇప్పటి వరకూ ఏ ప్రధాని కూడా ఐదేళ్ల పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగలేదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ముగ్గురు ప్రధాన మంత్రులు మాత్రమే గరిష్ఠంగా నాలుగేళ్లు అధికారంలో ఉన్నారు. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ సహా అయిదుగురు మాత్రమే కనీసంగా మూడేళ్లు ఆ పీఠంపై కూర్చోగలిగారు. లియాఖత్‌ అలీ ఖాన్‌ ఒక్కరే ప్రధాని పదవిలో అత్యధికంగా 1524 రోజులు కొనసాగారు. పదవీలో ఉన్న సమయంలోనే 1951 అక్టోబరు 16న ఆయన హత్యకు గురయ్యారు. లియాఖత్‌ తదనంతరం ఏడేళ్ల సమయంలో ఆరుగురు ప్రధాన మంత్రులు మారారు. 1947 నుంచి 1958 వరకు పదకొండేళ్ల కాలంలో ఏడుగురు ప్రధాని పదవిని అలంకరించారు. తొలి సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి పాకిస్థాన్‌కు 23 ఏళ్లు పట్టింది. 1970లో జరిగిన ఎన్నికల్లో తూర్పు పాకిస్థాన్‌లో అవామీ లీగ్‌, పశ్చిమ పాకిస్థాన్‌లో పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ఆధిక్యం సాధించాయి. తదనంతర రాజకీయ సంక్షోభం బంగ్లాదేశ్‌ ఆవిర్భవానికి దారితీసింది.

నవాజ్‌ షరీఫ్‌ మూడు సార్లు(1990, 1997, 2013) ప్రధాని పదవిని చేపట్టినప్పటికీ ఏ విడతలోనూ ఐదేళ్ల పూర్తికాలం కొనసాగలేకపోయారు. అవినీతి ఆరోపణలతో రెండు సార్లు(1993, 2017), సైనిక తిరుగుబాటుతో ఒకసారి(1999) పదవీచ్యుతుడయ్యారు. మొత్తంగా తొమ్మిదిన్నరేళ్లు ప్రధాని పదవిలో ఉన్నారు. పాకిస్థాన్‌లో నలుగురు సైన్యాధిపతులు దేశాధ్యక్షులయ్యారు. 32 ఏళ్లపాటు దేశాన్ని పాలించారు. స్వయం ప్రకటిత ఫీల్డ్‌ మార్షల్‌ ఆయుబ్‌ఖాన్‌ 1958 నుంచి 1969 వరకు, జనరల్‌ యాహ్యాఖాన్‌ సైన్యాధిపతిగా, దేశాధ్యక్షుడిగా 1969 నుంచి 1971 వరకు, జనరల్‌ జియా ఉల్‌ హక్‌ 1978 నుంచి 1988 వరకు, జనరల్‌ ముషారఫ్‌ 2001 నుంచి 2007 వరకు దేశాధ్యక్ష పదవిలో కొనసాగారు. పాకిస్థాన్‌ సైన్యం మూడు సార్లు పౌర ప్రభుత్వాలను కూలదోసింది.పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవిని కోల్పోయిన తొలి వ్యక్తిగా ఇమ్రాన్‌ఖాన్‌ నిలిచారు.

ఇదీ చదవండి:ఉక్రెయిన్ మందుగుండు స్థావరంపై రష్యా వైమానిక దళం దాడి

Last Updated : Apr 10, 2022, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details