ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రాజీనామా చేసే ప్రసక్తే లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. చివరి వరకు పోరాటం చేయనున్నట్లు చెప్పారు. రాజీనామా వార్తల నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇమ్రాన్ ఖాన్. దేవుడు తనకు అన్ని ఇచ్చాడని తనకు దేనిపైనా వ్యామోహం లేదన్నారు. అధికారం నిలబెట్టుకునేందుకు ఎవరి ముందు తలొగ్గే ప్రసక్తే లేదని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు.
" పాక్ స్వాతంత్యం సాధించిన తర్వాత పుట్టిన మొదటి తరానికి నేను ప్రతినిధిని. ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి దింపేయాలని, లేదంటే పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని ఓ దేశం సందేశం పంపించింది. నేను 20 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాను. చివరి బంతి వరకు ఆడతానని ప్రపంచంతో పాటు నాతో ఆడిన వారంతా చూశారు. ఓటమి ఎప్పటికీ అంగీకరించను. నేను ఇంట్లో కూర్చుంటానని ఎవరూ ఆలోచించొద్దు. ఫలితం ఎలా ఉన్నా.. మరింత బలంగా తిరిగొస్తా. నా చిన్నప్పుడు పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండేది. దక్షిణ కొరియా ఇక్కడికి వచ్చి అభివృద్ధి గురించి తెలుసుకునేది. విదేశాల నుంచి మన యూనివర్సిటీల్లో చదువుకునేందుకు విద్యార్థులు ఎక్కువగా వచ్చేవారు. మలేసియా యువరాణి నాతో పాటు చదువుకుంది. అవన్ని ఇప్పుడు క్షీణిస్తున్నాయి. నా దేశం అవమానాలకు గురవుతోంది."