Mohammad Hafeez no petrol tweet:పాకిస్థాన్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఆ దేశ క్రికెటర్, మాజీ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ్యవహార తీరుపై గతంలో గళంవిప్పిన హఫీజ్.. తాజాగా అక్కడి పరిస్థితులపై రాజకీయ నేతలను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. లాహోర్‌లోని బంకుల్లో పెట్రోల్ లేదని, ఏటీఎం యంత్రాల్లో నగదు అందుబాటులో లేదని పేర్కొన్నారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ ట్వీట్ చేశారు. రాజకీయ నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని ప్రశ్నించాడు. తన ట్వీట్‌కు ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు పలువురు రాజకీయ నేతలను ట్యాగ్ చేశాడు.
గత కొంతకాలంగా పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ గద్దెదిగిపోవడం, ఆ తర్వాత పీఎంఎల్ (ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఎన్నికవడం, ఆపై ఇమ్రాన్ తిరుగుబాటు ప్రకటించడం.. వంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.